జోగిపేటలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు
పట్టణంలో ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేసి ప్రదర్శిస్తే, ఆందోలు పర్యాటక కేంద్రం అవుతుందని శివనాగిరెడ్డి అన్నారు.
ఆందోలు పెద్ద చెరువు ఒడ్డున గల నాగులకట్టపైనున్న శిల్పాలు వెయ్యేళ్లనాటివని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు శివనాగిరెడ్డి ఆ శిల్పాలను పరిశీలించారు.
రంగనాథ స్వామి గోపురం ముందు రాష్ట్రకూటుల, కళ్యాణి చాళుక్యుల కాలం (క్రీ.శ. 9-10 శతాబ్దాలు), నాటి మహిషాసురమర్ధిని శిల్పాలు, నాగులకట్ట పైనున్న కళ్యాణి చాళుక్య, కాకతీయుల కాలంనాటి (క్రీ.శ. 11-13 శతాబ్దాల నాటి) చెన్నకేశవ, జనార్దన, నాగదేవతల శిల్పాలు, అలనాటి అద్భుత శిల్పకళా కౌశలానికి అద్దం పడుతున్నాయని, చెన్నకేశవ విగ్రహం చుట్టూ గల మకరతోరణం, శ్రీదేవి, భూదేవి, దశావతార శిల్పాలు చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొన్నాయని, పట్టణంలో ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేసి ప్రదర్శిస్తే, ఆందోలు పర్యాటక కేంద్రం అవుతుందని శివనాగిరెడ్డి అన్నారు.