Telugu Global
Telangana

చండూరులోని వెయ్యేళ్లనాటి శిల్పాల్ని కాపాడుకోవాలి

క్రీ.శ.15వ శతాబ్దం నాటి విష్ణు ద్వారాపాలకులైన జయ, విజయుల శిల్పాలు గ్రామ చరిత్రకు అద్దం పడుతున్నాయని, బాదామీ చాళుక్యుల నుంచి విజయనగర అనంతర కాలం వరకు చెందిన ఈ శిల్పాల గురించి స్థానికులకు ఆయన వివరించారు.

చండూరులోని వెయ్యేళ్లనాటి శిల్పాల్ని కాపాడుకోవాలి
X

మానోపాడు మండల కేంద్రానికి 15 కి.మీ. దూరంలో, జాతీయ రహదారిపై జల్లాపురం అడ్డ రోడ్డు నుంచి 7 కి.మీ. దూరంలో ఉన్న చండూరులోని వెయ్యేళ్ల నాటి శిల్పాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి సాహితి వైజయంతి ట్రస్టు సమన్వయకర్త సురవరం గిరిధర్ రెడ్డి ఆహ్వానంపై చండూరుకి వచ్చిన ఆయన స్థానిక కళ్యాణ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న‌ క్రీ.శ. 8-9 శతాబ్దాల నాటి నాగదేవత శిల్పాలు, క్రీ.శ. 11-12 శతాబ్దాల నాటి వీరగల్లులు, క్రీ.శ. 13 వ శతాబ్దం నాటి భైరవ, సూర్య శిల్పాలు, క్రీ.శ. 16వ శతాబ్దం నాటి చెన్నకేశవ శిల్పం, క్రీ.శ.18వ శతాబ్దం నాటి దంపతుల శిల్పాలు.. ఇంకా ఆలయంలోని చాళుక్య కాలపు గణపతి, శివలింగం, నంది విగ్రహాలు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకొన్నాయని ఆయన అన్నారు.


అక్కడే ఉన్న క్రీ.శ.15వ శతాబ్దం నాటి విష్ణు ద్వారాపాలకులైన జయ, విజయుల శిల్పాలు గ్రామ చరిత్రకు అద్దం పడుతున్నాయని, బాదామీ చాళుక్యుల నుంచి విజయనగర అనంతర కాలం వరకు చెందిన ఈ శిల్పాల గురించి స్థానికులకు ఆయన వివరించారు.



ఈ శిల్పాలను పీఠాలపై నిలబెట్టి, చారిత్రక వివరాలతో ఫలకాలను ఏర్పాటు చేస్తే రాగల తరాలకు మన వారసత్వని తెలియజేయడమే కాకుండా, పరిరక్షించిన వాళ్ళమవుతామని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సురవరం విజయభాస్కర్ రెడ్డి, బొమ్మారెడ్డి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

First Published:  9 Dec 2023 2:55 PM IST
Next Story