'గ్రేటర్'లో సర్వే కోసం పర్యవేక్షణ అధికారుల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో కచ్చితత్వంతో పాటు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీతో పాటు జోనల్ స్థాయిలోనూ ఈ సర్వే పకడ్బందీగా నిర్వహించడానికి క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం కోసం పర్యవేక్షణ అధికారులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో పర్యవేక్షణ అధికారిగా హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లకు హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషన్ శ్రీవత్సను నియమించారు. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లకు మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ పర్యవేక్షించనున్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఝార్ఖండ్ ఎన్నికల అధికారిగా వెళ్లారు. అయితే అక్కడి నుంచే సర్వే తీరును ఆయన పరిశీలిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా సర్వే పర్యవేక్షణ బాధ్యతలను సర్ఫరాజ్‌కు అప్పగించారు. జోనల్ కమిషనర్లు, పర్యవేక్షన అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రేటర్‌లో నిర్దేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేయాలని, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సర్ఫరాజ్ సహకారం అందించాలని ప్రభుత్వం సూచించింది.