ఎయిర్ పాడ్ ఆర్డర్ గెలుచుకున్న ఫాక్స్‌కాన్.. తెలంగాణ నుంచే ఉత్పత్తి?
ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఐఫోన్‌లలో 70 శాతం ఫోన్లను ఫాక్స్‌కాన్ కంపెనీయే తయారు చేస్తోంది.
తైవాన్‌కు చెందిన అతి పెద్ద కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్ ఫాక్స్‌కాన్.. ఆపిల్ ఎయిర్ పాడ్స్ తయారు చేసే ఆర్డర్ గెలుచుకున్నది. ఐఫోన్స్, ఐపాడ్స్ కోసం ఉపయోగించే వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ ఉత్పత్తి ఇకపై ఫాక్స్‌కాన్ చేపట్టనున్నట్లు కంపెనీకి చెందిన వ్యక్తులు తెలియజేశారు. ఈ మేరకు రాయిటర్స్ సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలోనే అతి పెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ మేకర్ అయిన ఫాక్స్‌కాన్.. ఇకపై ఆపిల్ ఎయిర్ పాడ్స్‌ను కూడా ఉత్పత్తి చేయనున్నది. ఎయిర్ పాడ్స్‌ను ఫాక్స్‌కాన్ సంస్థ తయారు చేయనుండటం ఇదే తొలి సారి.
ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఐఫోన్‌లలో 70 శాతం ఫోన్లను ఫాక్స్‌కాన్ కంపెనీయే తయారు చేస్తోంది. అయితే, ఎయిర్ పాడ్స్‌ను మాత్రం ఇప్పటి వరకు చైనాకు చెందిన ఇతర కంపెనీలు తయారు చేస్తూ వస్తున్నాయి. తాజాగా ఎయిర్ పాడ్స్ ఆర్డర్ గెలుచుకోవడంతో వాటి తయారీకి కూడా సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. కొంగరకలాన్‌లో తొలి దశలో దాదాపు రూ.1650 కోట్ల వ్యయంతో ఎయిర్ పాడ్స్ ఉత్పత్తికి సంబంధించిన యూనిట్ నెలకొల్పే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వాస్తవానికి ఎయిర్ పాడ్స్ ఉత్పత్తి ద్వారా ఫాక్స్‌కాన్‌కు వచ్చే మార్జిన్లు చాలా తక్కువ. అందుకే వాటి జోలికి ఇంత వరకు వెళ్లలేదు. అయితే ఆపిల్ సంస్థతో ఉన్న అనుబంధం కారణంగా తాజాగా ఎయిర్ పాడ్స్ ఉత్పత్తిని ప్రారంభించడానికి ఫాక్స్‌కాన్ ముందుకు వచ్చింది. కొంగరకలాన్‌లో తొలుత ఎయిర్ పాడ్స్ ఉత్పత్తి చేసినా.. భవిష్యత్‌లో ఇతర ఆపిల్ పరికరాలు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఫాక్స్‌కాన్ తమ చైనా యూనిట్‌లో ఐ ఫోన్స్ ఉత్పత్తి చేస్తోంది. అయితే కోవిడ్ నేపథ్యంలో అక్కడ కఠినమైన ఆంక్షలు ఉండటంతో ఐఫోన్ల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఆపిల్ కూడా ఇకపై తమ ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయాలని ఫాక్స్‌కాన్‌ను కోరినట్లు తెలుస్తున్నది. దీంతో ఇండియాలో కంపెనీ విస్తరణకు ఫాక్స్‌కాన్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఫాక్స్‌కాన్ సబ్సిడరీ అయిన ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ తెలంగాణలో త్వరలో మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించనున్నదని.. ఈ ఏడాది చివరి నాటికి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని తెలుస్తున్నది.