Telugu Global
Telangana

ఏపూరి సోమన్న కొత్తపాట.. బీఆర్ఎస్‌కు గుడ్‌బై

ఏపూరి సోమన్న పార్టీ మారడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోమన్నది నిలకడ లేని స్వభావం అని.. ఇలా ఎన్ని పార్టీలు మారుకుంటూ పోతారని బీఆర్ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు.

ఏపూరి సోమన్న కొత్తపాట.. బీఆర్ఎస్‌కు గుడ్‌బై
X

ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి సొంత గూటికి వెళ్లారు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న. ఎమ్మెల్యే కోమటిరెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్‌లో YSRTPకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు ఏపూరి సోమన్న. 6 నెలలు కాక ముందే మళ్లీ పార్టీ మారారు. గతంలోనూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు ఏపూరి సోమన్న. రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. ఆయన పాదయాత్రలోనూ ఏపూరి పాల్గొన్నారు.

ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేశారు ఏపూరి సోమన్న. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత షర్మిల రాకతో వైఎస్సార్‌టీపీలో చేరారు. అక్కడ విభేదించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి సొంత గూటికి చేరిపోయారు.

ఏపూరి సోమన్న పార్టీ మారడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోమన్నది నిలకడ లేని స్వభావం అని.. ఇలా ఎన్ని పార్టీలు మారుకుంటూ పోతారని బీఆర్ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. ఏపూరి సోమన్నది సూర్యపేటలోని తుంగతుర్తి నియోజకవర్గం. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ఆయన కోరిక. ప్రతిపార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నా.. ఆయన కల మాత్రం నెరవేరడం లేదు. ఎన్నికలకు ముందు ఏపూరి సోమన్న బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించలేదు. మరి కాంగ్రెస్‌లో ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తారనేది చూడాలి.

First Published:  15 April 2024 3:49 PM IST
Next Story