Telugu Global
Telangana

లండన్ తర్వాత హైదరాబాద్.. దావోస్ లో మరో కీలక ప్రకటన

ప్రస్తుతం అపోలో టైర్స్ సంస్థకు లండన్ లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఉంది. ఆ తర్వాత రెండో సెంటర్ ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయబోతున్నారు.

లండన్ తర్వాత హైదరాబాద్.. దావోస్ లో మరో కీలక ప్రకటన
X

డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ కి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారే అవకాశాలున్నాయి. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఖరారైంది. అపోలో టైర్స్ సంస్థ తమ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు దావోస్ సదస్సులో మంత్రి కేటీఆర్ తో ఆ సంస్థ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కన్వర్ చర్చలు జరిపారు. ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

లండన్ తర్వాత హైదరాబాద్ లోనే..

ప్రస్తుతం అపోలో టైర్స్ సంస్థకు లండన్ లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఉంది. ఆ తర్వాత రెండో సెంటర్ ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయబోతున్నారు. లండన్ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం తెలంగాణకు లభించిన అరుదైన గౌరవం అనే చెప్పాలి.


ఐవోటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, బ్లాక్ చైన్ వంటి కొత్త టెక్నాలజీలను ఉపయోగించుకుంటూ, వ్యాపార నమూనాలను అభివృద్ధి చేస్తామని అపోలో సంస్థ ప్రకటించింది. వినియోగదారులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఉపయోగపడుతుందని పేర్కొంది. మార్కెటింగ్, తయారీ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, కంపెనీ సప్లై చైన్‌ ను మరింత సమర్థంగా ఉపయోగించుకోడానికి తద్వారా సరైన సమయంలో లక్ష్యాలను సాధించడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపింది. లండన్‌ తర్వాత హైదరాబాద్‌ లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ ఏర్పాటు చేయడం సంస్థ డిజిటల్ వ్యూహంలో భాగమని వెల్లడించారు సంస్థ ఎండీ నీరజ్ కన్వర్. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  17 Jan 2023 1:11 PM GMT
Next Story