రేపు కేసీఆర్, జగన్ కీలక భేటీ
ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్ వస్తున్నారు జగన్. కేసీఆర్ ఇంటికి వెళ్తున్న జగన్ ఆయనతో కలిసి లంచ్ చేస్తారని సమాచారం.
ఏపీ సీఎం జగన్ రేపు (గురువారం) హైదరాబాద్ వస్తున్నారు. నేరుగా జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్తారు. ఆయన్ని పరామర్శిస్తారు. గతనెల 7న కేసీఆర్ తన ఫాం హౌస్‌లో కిందపడటంతో తుంటి ఎముకకు గాయమైంది. వైద్యులు ఆపరేషన్ చేశారు. దాదాపు వారం రోజులు కేసీఆర్ హాస్పిటల్‌లోనే ఉన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌తో పాటు ఏపీ మాజీసీఎం చంద్రబాబు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆ సమయంలోనే జగన్ పరామర్శకు వెళ్లాలని భావించారు. కానీ, ఎక్కువ మంది రావటం ద్వారా కేసీఆర్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఇప్పుడు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్ వస్తున్నారు జగన్.
కేసీఆర్ ఇంటికి వెళ్తున్న జగన్ ఆయనతో కలిసి లంచ్ చేస్తారని సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌ను తొలిసారి కలుస్తున్నారు జగన్. ఇప్పటివరకు తెలంగాణలో కేసీఆర్‌పై పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ అవ్వాలని నిర్ణయించారు.
ఈ సమయంలోనే జగన్, కేసీఆర్‌ను కలుస్తున్నారు. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమే అని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ రెండు రాష్ట్రాల్లో రాజకీయం మారుతున్న తరుణంలో జగన్ - కేసీఆర్‌ల భేటీ ఆసక్తికరంగా మారింది.