తెలంగాణలో కూడా బలపడతాం -చంద్రబాబు
2047 నాటికి ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా ఉన్నత స్థాయిలో ఉండేలా చేయడం తన లక్ష్యం అన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతాయని చెప్పారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు మీటింగ్ అంటే ఈరోజు తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు ఆ మాట దాటవేశారు. తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు తర్వాతే అధ్యక్షుడి ఎంపిక చేపడతామని చెప్పారు. తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం వచ్చేట్టు చేస్తానన్నారు. ఇకపై తెలంగాణపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతామని, ముందు ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను సరిచేయాలని చెప్పారు చంద్రబాబు.
గ్రామ స్థాయిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఇటీవల ఓసారి హైదరాబాద్ వచ్చానని, పార్టీ నేతలతో మరికొంత సమయం గడిపేందుకు ఈరోజు ఎన్టీఆర్ భవన్ కి వచ్చానన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి పార్టీని పటిష్టపరిచేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, వారందరి కోసం పార్టీ బలపర్చాలని అనుకుంటున్నానని చెప్పారు చంద్రబాబు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గత రెండు ఎన్నికలకు దూరంగా ఉన్నామని, ఇక్కడ పార్టీకి అధ్యక్షుడిని కూడా పెట్టలేదని వివరించారు.
తెలుగు ప్రజల కోసం నిరంతరం పని చేసిన పార్టీ టీడీపీ అని చెప్పారు చంద్రబాబు. తెలంగాణలో తెలుగు జాతి ఎదగాలన్నారు. విజన్ 2047 కోసం పనిచేస్తున్నట్టు తెలిపారాయన. 2047 నాటికి ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా ఉన్నత స్థాయిలో ఉండేలా చేయడం తన లక్ష్యం అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతాయని చెప్పారు చంద్రబాబు.