Telugu Global
Telangana

రామోజీరావు ఇంటికి సీఐడీ, శైలజాకిరణ్‌ విచారణ

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రామోజీరావు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. అక్కడ రామోజీరావు కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ ఉంటున్నారు.

రామోజీరావు ఇంటికి సీఐడీ, శైలజాకిరణ్‌ విచారణ
X

మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు మార్చేందుకు సుప్రీంకోర్టు వరకు ఏపీ ప్రభుత్వం వెళ్లింది. అదే సమయంలో మార్గదర్శి ఆఫీసులు, ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే తనిఖీలు నిర్వహించిన ఏపీ సీఐడీ అధికారులు తాజాగా నేడు నేరుగా రామోజీరావు ఇంటికే వెళ్లారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రామోజీరావు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. అక్కడ రామోజీరావు కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ ఉంటున్నారు. ఆమెను విచారించేందుకే సీఐడీ అధికారులు అక్కడికి వెళ్లారు. మార్గదర్శి నిధులను ఇప్పటికే రామోజీ గ్రూపున‌కు చెందిన ఇతర కంపెనీలకు దారిమళ్లించినట్టు సీఐడీ నిర్ధారించింది. అసలు మొత్తం ఎంత డబ్బు వసూలు చేశారు.. ఆ సొమ్మును ఎక్కడెక్కడకు మళ్లించారు అన్న దానిపై శైలజాకిరణ్ దగ్గర పక్కా సమాచారం ఉందన్న ఉద్దేశంలోనే సీఐడీ బృందం ఆమెను విచారిస్తోంది. శైలజాకిరణ్‌ విచారణను కూడా రికార్డు చేస్తున్నారు. ఇందుకోసం సీఐడీ అధికారులే కెమెరాలను తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ప్రింటర్లను వెంట తీసుకెళ్లారు.

విచారించేందుకు వచ్చిన సీఐడీ అధికారులను వెంటనే లోనికి అనుమతించలేదు. మేడం ఇంకా రెడీ కాలేదంటూ చాలా సేపు సీఐడీ అధికారులను గేటు బయట రోడ్డు మీదనే నిలబెట్టారు. ఇప్పటికే మార్గదర్శి కేసులో పలు ఆస్తులను ఏపీ సీఐడీ అటాచ్‌ చేసింది. 798 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అటాచ్‌లో ఉన్నాయి. ఖాతాదారులకు డబ్బు తిరిగి చెల్లించే స్థితిలో సంస్థ లేదని.. అందుకే చందాదారుల ప్రయోజనాల కోసమే ఆస్తులు అటాచ్‌ చేసినట్టు సీఐడీ వెల్లడించింది.

First Published:  6 Jun 2023 9:28 AM GMT
Next Story