మరో వారం వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్నిచోట్ల భారీవర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది.
వచ్చేవారం రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. వాతావరణంలో మార్పుల వల్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. సోమవారం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ఠం 23.5 డిగ్రీలుగా నమోదైంది.
ఈ జిల్లాలకు అలర్ట్..
ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. బుధవారం ఈ జిల్లాలతోపాటు మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయన్నారు. హైదరాబాద్‌లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు.
ఉమ్మడి వరంగల్‌లో భారీ వర్షం..
సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్నిచోట్ల భారీవర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది.