తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. కొత్త రూట్ కన్ఫార్మ్ చేసిన రైల్వే అధికారులు
Nagpur-Hyderabad Vande Bharat Express: రైల్వే మంత్రి సానుకూలత వ్యక్తం చేయడంతో రైల్వే అధికారులు తాత్కాలిక టైం టేబుల్‌ను రూపొందించారు.
తెలంగాణలో మరో వందే భారత్ రైలు పరుగులు తీయనున్నది. దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య సెమీ-స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో ఆయా జోన్లకు వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ కేటాయిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతికి రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మొదటగా సికింద్రాబాద్-వైజాగ్ రూట్లో వందే భారత్ ప్రవేశపెట్టారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా వైజాగ్ వరకు ఈ రైలు నడుస్తోంది.
ఇక రెండో రైలు సికింద్రాబాద్ నుంచి నల్గొండ, గుంటూరు జంక్షన్, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతి వరకు నడిపిస్తున్నారు. తాజాగా, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మధ్య మరో వందేభారత్ రైలు ప్రారంభం కానున్నది. రైల్వే శాఖ ముందుగానే సికింద్రాబాద్ నుంచి మూడు వందే భారత్‌లను ప్రతిపాదించింది. విశాఖ, తిరుపతి కాకుండా పూణేకు వందే భారత్ నడుపుతామని చెప్పింది. అయితే పూణే ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేసింది. దానికి బదులుగా నాగ్‌పూర్ రూట్లో వందేభారత్ నడపనున్నది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది.
నాగ్‌పూర్ - సికింద్రాబాద్ మధ్య 581 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 11 గంటల సమయం పడుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వ్యాపారులు, ఉద్యోగులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గిస్తే వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత దృఢంగా మారుతాయని మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుదీర్ ముంగంటివార్ చెబుతున్నారు. అందుకే రైల్వే శాఖ మంత్రిని కలిసి ప్రతిపాదనలు పెట్టానని చెప్పారు.
రైల్వే మంత్రి సానుకూలత వ్యక్తం చేయడంతో రైల్వే అధికారులు తాత్కాలిక టైం టేబుల్‌ను రూపొందించారు. వందేభారత్ నాగ్‌పూర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.00 గంటలకు నాగ్‌పూర్ చేరుకోనున్నది.
వారానికి ఆరు రోజుల పాటు నాగ్‌పూర్ - సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ ట్రెయిన్‌కు బల్లర్షా, కాగజ్‌నగర్, రామగుండం, కాజీపేటల్లో స్టాప్స్ ఏర్పాటు చేశారు. వందేభారత్ ఏసీ చైర్ క్లాస్ టికెట్ రూ.1,450 నుంచి రూ.1,550 వరకు ఉండనున్నది. ఇక ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్ టికెట్ రూ.2,750 - రూ.2,850 మధ్య ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.