ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి మరో అడుగు.. టెండర్లు ఆహ్వానించిన హెచ్ఏఎంఎల్
ఆసక్తిగల సంస్థలు ఈ నెల 17 నుంచి 29లోపు రూ.2 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించి హెచ్ఏఎంఎల్ కార్యాలయం నుంచి టెండర్ డాక్యుమెంట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఎయిర్‌పోర్ట్ మెట్రో పనుల్లో కీలక అడుగు పడింది. 31 కిలో మీటర్ల పొడవైన ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్ నిర్మాణానికి అంతర్జాతీయ కాంపిటేటీవ్ బిడ్డింగ్స్‌ను ఆహ్వానిస్తూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ మెట్రో లైన్‌లో ఎలివేటెడ్ మార్గంతో పాటు తొమ్మిది మెట్రో స్టేషన్లు, ట్రాక్ వర్క్స్, ట్రాక్షన్ అండ్ పవర్ సప్లై, సిగ్నలింగ్ అండ్ టెలికమ్యునికేషన్, ఏఎఫ్‌సీ తదితర పనులను చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.5,688 కోట్లుగా హెచ్ఏఎంఎల్ పేర్కొన్నది. బిడ్ సెక్యూరిటీగా రూ.29 కోట్లు జమ చేయాలని.. 36 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఆసక్తిగల సంస్థలు ఈ నెల 17 నుంచి 29లోపు రూ.2 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించి హెచ్ఏఎంఎల్ కార్యాలయం నుంచి టెండర్ డాక్యుమెంట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. జూలై 5 సాయంత్రం 3.00 గంటల లోపు బిడ్లు సమర్పించాలని హెచ్ఏఎంఎల్ తెలియజేసింది.
ఎయిర్‌పోర్టు మెట్రోలైన్ నిర్మాణానికి అవసరమైన ఈపీసీ టెండర్ డాక్యుమెంట్ల తయారీ కోసం ఇప్పటికే సిస్ట్రా, రైట్స్ డీబీ ఇంజనీరింగ్‌ల కన్సార్టియంను జనరల్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా నియమించింది. ఎయిర్ పోర్టు మెట్రో నిర్మాణంలో ఈ కన్సార్టియం పలు విభాగాల్లో నిష్ణాతులైన 18 మంది ఇంజనీరింగ్ నిపుణులు, క్షేత్ర స్థాయిలో మరో 70 మంది సీనియర్ ఇంజనీర్లను సమకూర్చనున్నది.
ఇటీవల మెట్రో అలైన్‌మెంట్‌ను సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో కొండపై నుంచి వయాడక్ట్ వెళ్లేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఓఆర్ఆర్ వెంబడి చాలా వరకు మెట్రో లైన్ నిర్మాణం జరుగనున్నది. మెట్రో లైన్ నిర్మాణానికి అవసరమయ్యే వ్యయం మొత్తం తెలంగాణ ప్రభుత్వం భరించనున్నది.