బీఆర్ఎస్‌కు మరో షాక్.. బీజేపీలోకి సైదిరెడ్డి..?
బీజేపీ అగ్రనేతలు సైదిరెడ్డితో టచ్‌లోకి వచ్చారని వార్తలు వస్తున్నాయి. పార్టీలోకి వస్తే నల్గొండ పార్లమెంట్ సీటు ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో.. పలువురు బీఆర్ఎస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఇక తాజాగా మరో నేత కమలం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరనున్నారని సమాచారం.
ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు సైదిరెడ్డితో టచ్‌లోకి వచ్చారని వార్తలు వస్తున్నాయి. పార్టీలోకి వస్తే నల్గొండ పార్లమెంట్ సీటు ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై సైదిరెడ్డి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 2019లో ఉత్తమ్ రాజీనామాతో జరిగిన ఉపఎన్నికలో హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ పద్మావతిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు సైదిరెడ్డి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇక సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణ తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇందులో భాగంగానే నాగర్‌కర్నూలు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములును పార్టీలో చేర్చుకుంది. ఇక ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేతతోనూ బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం.