తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు విడుదల చేసింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న బైపోల్ జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 4న వెలువడనుంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. గతేడాది డిసెంబర్ 8న ఈ స్థానం ఖాళీ అయింది. షెడ్యూల్ విడుదల కావడంతో ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.
మార్చి 4న నోటిఫికేషన్ రానుండగా.. మార్చి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 12 నామినేషన్ల పరిశీలన, మార్చి 14 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 28న పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్‌లతో భర్తీ చేసింది కాంగ్రెస్. ఇక గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ ఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా.. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది.