1, 2, 6, 7.. తగ్గేది లేదంటున్న రేవంత్
ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఏడుగురు ఎమ్మెల్యేలు...
ఆరుగురు ఎమ్మెల్సీలు..
ప్రస్తుతానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారి సంఖ్య ఇది. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగేలా లేగు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ లిస్ట్ ని ఇక్కడితో ఆపాలనుకోవట్లేదు. వీలైనంత మందిని బీఆర్ఎస్ కి దూరం చేయడమే ఆయన లక్ష్యంగా కనపడుతోంది. తాజాగా మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతల్ని రేవంత్ రెడ్డి స్వయంగా కలసి పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన గంటల వ్యవధిలోనే.. మరో ఇద్దరు నేతల్ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం. మరో రెండు లేదా మూడు రోజుల్లో వీరిద్దరూ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు.
పార్టీ ఫిరాయింపులపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఫిరాయింపుల విషయంలో నీతి సూత్రాలు వల్లించే రాహుల్ గాంధీ.. తెలంగాణలో జరుగుతున్న గోడదూకుళ్లను ఎలా సమర్థిస్తారని బీఆర్ఎస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పార్టీ మారిన వారిన రాళ్లతో కొట్టాలంటూ గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అలాంటి వారికి ఎలా కండువా కప్పుతారని కూడా అడుగుతున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఇవేవీ పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ ని పూర్తి స్థాయిలో ఆయన టార్గెట్ చేశారు. అవసరం ఉన్నా, లేకపోయినా చేరికలను ఆపట్లేదు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు పిలిచి మరీ కాంగ్రెస్ కండువా కప్పేస్తున్నారు. ఈ కౌంట్ ఎక్కడితో ఆగుతుందో చూడాలి.