Telugu Global
Telangana

తెలంగాణకు మరో అన్యాయం.. ఎపిగ్రఫీ మ్యూజియం తిరుచ్చికి తరలింపు..!

తెలంగాణ కోసం ఓ కేంద్రమంత్రి చేయలేని పనిని, తమిళనాడుకోసం ఓ సీనియర్ ఐఏఎస్ చేస్తుండటం విశేషం. ఇప్పటికైనా కిషన్ రెడ్డి ఈ వ్యవహారంపై దృష్టిపెడితే ఫలితం ఉంటుంది.

తెలంగాణకు మరో అన్యాయం.. ఎపిగ్రఫీ మ్యూజియం తిరుచ్చికి తరలింపు..!
X

కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తే. కానీ ఏం లాభం. హైదరాబాద్ కి రావాల్సిన ఎపిగ్రఫీ మ్యూజియం ఇప్పుడు తమిళనాడులోని తిరుచ్చికి తరలిపోతోంది. కనీసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ మ్యూజియాన్ని హైదరాబాద్ కే కేటాయించేందుకు మంత్రి ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారుకి ఉన్న ద్వేషం ఈ వ్యవహారంతో మరోసారి బయట పడినట్టయింది.

దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల (ఎపిగ్రఫీ మ్యూజియం)ను హైదరాబాద్‌ లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన గతేడాది రూపుదాల్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమోద ముద్రకూడా పడింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ మ్యూజియాన్ని హైదరాబాద్‌ లో కాకుండా తిరుచ్చిలో ఏర్పాటు చేసేలా తమిళనాడుకు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. భారత పురావస్తు శాఖ (ASI)లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు, ఢిల్లీలోని మరికొందరు తమిళ ఐఏఎస్‌ అధికారులు ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీరి ప్రయత్నాలు విజయవంతం అయితే హైదరాబాద్ కి మరింత పర్యాటక శోభ తీసుకు రావాల్సిన ప్రాజెక్టు కాస్తా తమిళనాడుకి తరలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

దేశంలో శాసనాలకు ప్రత్యేకంగా మ్యూజియం లేదు. మైసూరు కేంద్రంగా ASIలో భాగంగా శాసనాల విభాగం ఉంది. దీని పరిధిలో లక్నో, చెన్నై, నాగ్‌ పూర్‌ లలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. మైసూరులో 75 వేల శాసనాలకు చెందిన నకళ్లు ఉన్నాయి. వీటిని ప్రజల సందర్శనకోసం మ్యూజియంగా ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో లభించిన శాసనాలను భద్రపరిచేందుకు, పర్యాటకులు వాటిని తిలకించేందుకు వీలుగా ఎపిగ్రఫీ మ్యూజియాన్ని హైదరాబాద్‌లో ఏర్పా టు చేయాలని చరిత్ర పరిశోధకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతేడాది ఇదే విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి దృష్టికి తేవడంతో ఆయన ఆమోదం తెలిపారు.

కానీ తమిళనాడుకి చెందిన ఓ సీనియర్ అధికారి కేంద్ర మంత్రి ప్రతిపాదనలకు అడ్డుకట్ట వేస్తున్నారు. హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఓ చిన్న పెవిలియన్ ఏర్పాటు చేస్తే చాలని, ఎపిగ్రఫీ మ్యూజియాన్ని తిరుచ్చిలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారట. ఆ తర్వాత తిరుచ్చిలో జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలనేది కూడా ఆయన ఆలోచన. ఇక్కడ కేంద్ర మంత్రి నిర్లక్ష్యం, అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ కోసం ఓ కేంద్ర మంత్రి చేయలేని పనిని, తమిళనాడు కోసం ఓ సీనియర్ ఐఏఎస్ చేస్తుండటం విశేషం. ఇప్పటికైనా కిషన్ రెడ్డి ఈ వ్యవహారంపై దృష్టిపెడితే ఫలితం ఉంటుంది. లేదంటే కేంద్రం కచ్చితంగా తెలంగాణపై ద్వేషంతో ఆ మ్యూజియాన్ని తమిళనాడుకి తరలిస్తుంది.

First Published:  27 Sept 2022 12:22 PM IST
Next Story