తెలంగాణ విముక్తికి మరో సంకల్ప దీక్ష చేపట్టాలె
ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయన్న కేటీఆర్
కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉన్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై కేసీఆర్ చెరిగిపోని సంతకం చేశారు. 2009 నవంబర్ 29న దీక్ష చేపట్టారు. 'కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో' అన్న మాట దేశ రాజకీయాలను కదిలించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భమే దీక్షా దివస్. అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యింది.కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చింది. ఒక్క వర్గం కాదు.. అట్టడుగు వర్గాల నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారు.ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో మళ్లీ కేంద్ర పార్టీల మెడలు వంచాల్సిన అవసరం ఉందన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. 33 జిల్లా కేంద్రాల్లో, పార్టీ కార్యాలయాల్లో నవంబర్ 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనికోసం సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జులుగా నియమిస్తున్నామని తెలిపారు. నవంబర్ 26న సన్నాహక సమావేశాలుంటాయన్నారు. 29న నిమ్స్‌లో అన్నదానం చేస్తామన్నారు. డిసెంబర్ 9న మేడ్చల్‌లో ఘనంగా తెలంగాణ తల్లికి ప్రణమిళ్లుతాం. అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ హాజరు కారని, ఇవి మేము ఆయనకు కృతజ్ఞత చెప్పుకునే కార్యక్రమాలని కేటీఆర్ పేర్కొన్నారు.