ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య.. హరీష్ రావు ట్వీట్
తీసుకున్న అప్పు చెల్లించలేదంటూ వెంకట్ రెడ్డి అన్న భూపాల్ రెడ్డి దగ్గర భూమి తీసుకున్న వీరన్న.. హద్దులు మార్చి పక్కనే ఉన్న వెంకట్ రెడ్డి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో వరుస రైతు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య మరువక ముందే ఖమ్మం రూరల్ మండలం జాన్‌పహడ్ తండాలో ఏలేటి వెంకట్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. తన భూమి ఆక్రమణకు గురైందంటూ ఆదివారం పురుగుల మందు తాగిన ఏలేటి వెంకట్ రెడ్డి.. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఖమ్మం జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం. ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాకు చెందిన రైతు ఏలేటి వెంకట్ రెడ్డి మృతి బాధకరం. పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వెంకట్ రెడ్డి మూడు రోజులపాటు మృత్యువుతోపోరాడి మరణించడం ప్రజాపాలనపై రైతులు కోల్పోతున్న… pic.twitter.com/eyrv8BuF8l
— Harish Rao Thanneeru (@BRSHarish) August 7, 2024
తమ మూడెకరాల భూమిని జాటోత్ వీరన్న అనే వ్యక్తి ఆక్రమించి సాగు చేస్తున్నాడంటూ వెంకట్ రెడ్డి సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. 2019 నుంచి వీరన్న, వెంకట్ రెడ్డి మధ్య భూ వివాదం నడుస్తోంది. తీసుకున్న అప్పు చెల్లించలేదంటూ వెంకట్ రెడ్డి అన్న భూపాల్ రెడ్డి దగ్గర భూమి తీసుకున్న వీరన్న.. హద్దులు మార్చి పక్కనే ఉన్న వెంకట్ రెడ్డి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే భూవివాదంలో 2021లో వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఖమ్మం జిల్లాలో వరుసగా జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు ఆత్మహత్యలు దురదృష్టకరమన్న హరీష్ రావు.. ప్రజాపాలనపై రైతులు నమ్మకం కోల్పోతున్నారంటూ విమర్శించారు. రైతులు అధైర్య పడొద్దని.. ఏవైనా సమస్యలు ఉంటే పోరాడి పరిష్కరించుకుందామని, చావు పరిష్కారం కాదన్నారు.