ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు హతం
ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల ఎన్‌కౌంటర్ జరిగింది
చత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఇవాళ ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు వెంట ఉన్న దక్షిణ బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ బాసగూడ, పమేడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా రెండు వైపుల నుంచి కాల్పులు చోటు చేసుకోగా సుమారు గంటన్నర పాటు కొనసాగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మూడు దళాల భద్రతా సిబ్బందితో కూడిన ఒక జాయింట్ టీమ్ యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపడుతోందని, ఈ క్రమంలో గురువారం ఉదయం కాల్పులు మొదలయ్యాయని తెలిపారు.
డీఆర్ఎస్ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా సిబ్బంది ఉమ్మడిగా ఈ ఆపరేషన్ చేపట్టారని వివరించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, తదుపరి సమాచారం అందాల్సి ఉందని అధికారి పేర్కొన్నారు. కాగా, నవంబర్ నెల నుంచి ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. నక్సల్స్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే, ఈ ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా మావోయిస్టులు ఇటీవల భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు విరమరణం పొందిన విషయం తెలిసిందే. 2026 నాటికి నక్సల్స్ రహిత్ దేశాన్ని ఆవిష్కరిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నా సంగతి తెలిసిందే.