Telugu Global
Telangana

పోయే.. ఈడ కూడా పోయే.. కాంగ్రెస్‌కు పొంచి ఉన్న ముప్పు

కాంగ్రెస్‌ సీనియర్లు ఆశించినట్టుగానే అయింది. వాళ్ల కళ్లు మరోసారి చల్లబడేలా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ మునుగోడులోనూ డిపాజిట్లు కోల్పోయింది. రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతుండగానే రేవంత్ రెడ్డి పవరేంటో తేలిపోయింది.

పోయే.. ఈడ కూడా పోయే.. కాంగ్రెస్‌కు పొంచి ఉన్న ముప్పు
X

రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి. కాంగ్రెస్‌లో నెట్టుకురావడం, తెలంగాణలో పార్టీని గట్టెక్కించడం అన్నది.. లాబీయింగ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకుని.. వెంటనే గాంధీభవన్‌కు సున్నాలేయించి.. బాహుబలి అని ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకున్నంత ఈజీ కాదని. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి నాలుగువేల ఓట్లు కూడా రాలేదు. దాంతో అప్పటి వరకు బాహుబలి అంటూ ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి వైపు.. కాంగ్రెస్‌ నేతలంతా పాత సినిమాల్లో బాబుమోహన్ వైపు కోటశ్రీనివాస్‌ రావు చూసినట్టుగా చూశారు. ఆ సమయంలో లేదులేదు.. కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలన్న ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ అక్కడ ఫోకస్ పెట్టలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నాలు జరిగాయి.

మునుగోడుకు వచ్చే సరికి ఆ చాన్స్‌ కూడా లేకుండాపోయింది. రేవంత్ రెడ్డి ఇక్కడ నవరసాలు పండించారు. బస్తీమే సవాల్ అంటూ చాలెంజ్‌ చేశారు. ఒక రోజు కుట్ర జరుగుతోంది అంటూ కన్నీరు పెట్టారు. మరో రోజు ఆడబిడ్డకు అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా వేలాదిగా మునుగోడుకు తరలిరండి అంటూ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు తరలిరాకపోగా.. కాంగ్రెస్ సీనియర్లంతా ''హేయ్‌.. రేవంత్ మళ్లీ ఏసేశాడు'' అంటూ జోకులేసుకున్నారు.

కాంగ్రెస్‌ సీనియర్లు ఆశించినట్టుగానే అయింది. వాళ్ల కళ్లు మరోసారి చల్లబడేలా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ మునుగోడులోనూ డిపాజిట్లు కోల్పోయింది. రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతుండగానే రేవంత్ రెడ్డి పవరేంటో తేలిపోయింది. ఈ ఓటమికి ఒక్క రేవంత్ రెడ్డే నిందించలేం. అసలు ఇప్పుడు కాంగ్రెస్ కోసం నమ్మకంతో, భవిష్యత్తుపై ధీమాలో పనిచేస్తున్నవారెవరు?.

మొన్నటి వరకు కొందరిలోనైనా రేవంత్ రెడ్డి దూకుడు తమను గట్టెక్కిస్తుందేమోనని ఆశ ఉండేది. వరుసగా డిపాజిట్లే పోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఇక ఆ ఆశ ఆవిరైంది. టీ-కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రధాన సమస్య.. పలాన నాయకుడు అందరి కంటే గొప్పవాడు.. ఈయన నాయకత్వంలో పనిచేసినా తమ ఈగోకు ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం కలిగించే నాయకుడు లేకపోవడమే. ఒకప్పుడు వైఎస్ ఆ అభిప్రాయాన్ని తీసుకురాగలిగారు. రేవంత్‌ రెడ్డి తనకు తాను ఆ పాత్రధారిగా ఊహించుకున్నా.. టీడీపీలో సంచులుమోసిన రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడేంది?. ఆయన కింద మనం పనిచేయడం ఏంటి?. అన్న బాధ చాలా మందిలో ఉంది. ఒక విధంగా పక్క పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డే కాంగ్రెస్‌కు దిక్కుఅన్న పరిస్థితి వచ్చిన రోజే కాంగ్రెస్‌ బలహీనత బయటపడిపోయింది. ఇలా వరుసగా డిపాజిట్లు కోల్పోతున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు మరో పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

అదే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ వలస వెళ్లడం. జనం సహజంగా కూలే గోడ కింద నిల్చోరు.. తమ ఓటు పలాన పార్టీకి వేసినా, చెత్తబుట్టలో వేసినా ఒకటే అన్న ఫీలింగ్ వ‌స్తే అస్సలు వేయరు. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఆ ప్రమాదమే పొంచి ఉంది. ఓటు వేసినా కాంగ్రెస్‌ గెలిచే సూచనలు లేవు అన్నప్పుడు.. ఇతర పార్టీలను చాయిస్‌గా తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు యాంటీ బీజేపీ విధానాల మీద ఆధారంగా పడి ఉంటుంది కాబట్టి.. బీజేపీని అడుగుపెట్టనివ్వకూడదన్న భావనతో మరోపక్షం వైపు మళ్లే చాన్స్ ఉంది. ఈ ఘోర ఓటమికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారేమో మరి!. నైతిక బాధ్యత వంటి పదాలకు పెద్దగా విలువ లేని కాలమే గానీ.. డిపాజిట్లు కూడా తీసుకురాలేనప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారో.. లేదో మరి!.

First Published:  7 Nov 2022 12:02 PM IST
Next Story