Telugu Global
Telangana

చంద్రబాబుపై మరో కేసు.. ఏపీలో కాదు, తెలంగాణలో

ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నెంబర్‌ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 341, 290, 21 రెడ్‌ విత్‌ 76 సీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

చంద్రబాబుపై మరో కేసు.. ఏపీలో కాదు, తెలంగాణలో
X

చంద్రబాబుపై మరో కేసు.. ఏపీలో కాదు, తెలంగాణలో

చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. అయితే ఇది ఏపీలో కాదు, తెలంగాణలో. తెలంగాణలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన ర్యాలీ నిర్వహించడం, బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లడంతో పోలీసులు కేసు పెట్టారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నెంబర్‌ 531-2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 341, 290, 21 రెడ్‌ విత్‌ 76 సీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల జైలు నుంచి విడుదలైన చంద్రబాబు, రాజమండ్రి నుంచి ఉండవల్లి వరకు ర్యాలీగా వెళ్లారు. మరుసటి రోజు విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వెళ్లి.. అక్కడ బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ వరకు ర్యాలీగా కదలి వెళ్లారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అంటే ర్యాలీలు, రోడ్ షో లకు పోలీసుల అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా చంద్రబాబు ర్యాలీ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్లాన్ చేయకపోయినా అక్కడికి వచ్చిన కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుకి స్వాగతం పలికే క్రమంలో హడావిడి నెలకొంది. ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు. దీంతో పోలీసులు కేసు పెట్టారు.

వాస్తవానికి టీడీపీ, తెలంగాణలో పోటీ నుంచి విరమించుకుంది. అంటే తెలంగాణ ఎన్నికలతో టీడీపీకి కాని, చంద్రబాబుకి కానీ ప్రత్యక్ష సంబంధం లేదు. పరోక్షంగా బాబు, కాంగ్రెస్ కి మద్దతిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం. ఆయన ఎలక్షన్ స్ట్రాటజీ ఎలా ఉన్నా.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇప్పుడు కేసు నమోదైంది. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పటికే ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్కిల్ స్కామ్ లో 50రోజులకు పైగా జైలులో ఉండి అనారోగ్యం పేరు చెప్పి ఇటీవలే బెయిల్ పై బయటకొచ్చారు. ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు దాడి కేసు, తాజాగా లిక్కర్ స్కామ్.. ఇలా ఆయనపై చాలా కేసులే ఉన్నాయి. ఈ కేసుల్లో బెయిల్ కోసం తంటాలు పడుతున్న చంద్రబాబుకి తెలంగాణ పోలీసులు తాజాగా షాకిచ్చారు.

First Published:  2 Nov 2023 12:50 PM IST
Next Story