Telugu Global
Telangana

పోలవరంపై ఉమ్మడి సర్వేకు ఏపీ కావాలనే జాప్యం చేస్తోంది - తెలంగాణ ఫిర్యాదు

ఈ విషయంపై ఏపీ నుంచి కానీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదని, రానున్న 25 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని, అందుకే ముందుగా సర్వే పూర్తి చేయాలని తెలంగాణ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ సీ మురళీధర్ సోమవారం సీడబ్ల్యూసీ చైర్మన్‌కు లేఖ రాశారు.

పోలవరంపై ఉమ్మడి సర్వేకు ఏపీ కావాలనే జాప్యం చేస్తోంది - తెలంగాణ ఫిర్యాదు
X

తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై ఉమ్మడి సర్వే చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాప్యం చేస్తోందని, అందువల్ల ఏపీ ప్రమేయం ఉన్నా లేకున్నా తాము సర్వే ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఈ సమస్యపై జోక్యం చేసుకుని వెంటనే బ్యాక్ వాటర్ సర్వే చేపట్టాలని తెలంగాణ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ సీ మురళీధర్ సోమవారం సీడబ్ల్యూసీ చైర్మన్‌కు లేఖ రాశారు.

ఈ విషయంపై ఏపీ నుంచి కానీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదని, రానున్న 25 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని, అందుకే ముందుగా సర్వే పూర్తి చేయాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) ఉన్నప్పుడు 954.15 ఎకరాల విస్తీర్ణం మునిగిపోతుందని, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అథారిటీ నిబంధనల ప్రకారం తగిన రక్షణ చర్యలను చేపట్టడానికి పిపిఎ వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆయన కోరారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు సిడబ్ల్యుసి నివేదిక ప్రకారం కిన్నెరసాని , మూరెద్దు వాగు నదుల నీటి పారుదల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలను గుర్తించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు.

భద్రాచలం పట్టణంలోని నీళ్ళు బైటికి వదిలే 8 తూములు, చారిత్రక శ్రీరామ దేవాలయం, మణుగూరు హెవీ వాటర్‌ప్లాంట్‌కు సమీపంలో ఉన్న ముఖ్యమైన లెవెల్‌ల వెరిఫికేషన్‌ను వెంటనే జాయింట్ సర్వే చేపట్టి తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని మురళీధర్ సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకొచ్చారు.

First Published:  9 May 2023 9:47 AM IST
Next Story