Telugu Global
Telangana

ఓట‌మి బీజేపీది.. బాధ ఆంధ్ర‌జ్యోతిది

పోలీసుల దాడులకు భయపడి కమలనాథులు 150 కోట్లు బయటకు తీయలేదని అందుకే విజయం ముంగిట కోమటిరెడ్డి బోల్తా పడ్డారని ఆంధ్రజ్యోతి చెప్పొచ్చింది.

ఓట‌మి బీజేపీది.. బాధ ఆంధ్ర‌జ్యోతిది
X

మునుగోడులో టీఆర్‌ఎస్ గెలుపు ఆంధ్రజ్యోతి పత్రికకు పెద్దగా నచ్చినట్టు లేదు. టీఆర్‌ఎస్ గెలుపును చిన్నది చేసి చూపేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రయత్నించింది. బీజేపీ తరపున బలమైన రాజగోపాల్ రెడ్డి బరిలో దిగి వందల కోట్లు ఖర్చు చేసినా అక్కడ టీఆర్ఎస్‌ విజయం సాధించింది. అయితే గియితే ఈ ఎన్నిక ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్న రాజగోపాల్ రెడ్డికి... సిట్టింగ్ స్థానంలో డిపాజిట్‌ పోగొట్టుకున్న కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ. తనది కాని సీటును సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ ఇది అదనపు బూస్టే.

కానీ, ఆంధ్రజ్యోతి మాత్రం గెలవడమే పది వేలు అంటూ బ్యానర్ హెడ్‌లైన్ పెట్టేసింది. ''ఓడి గెలిచిన కమలం''... ''గట్టెక్కినా కారుకు గడ్డుకాలమే''.. ''పైసలు తీయనీయలే!''.. వంటి హెడ్‌లైన్లలో సొంత కథనాలు రాసింది ఆంధ్రజ్యోతి.

పోలీసుల దాడులకు భయపడి కమలనాథులు 150 కోట్లు బయటకు తీయలేదని అందుకే విజయం ముంగిట కోమటిరెడ్డి బోల్తా పడ్డారని ఆంధ్రజ్యోతి చెప్పొచ్చింది. చూసేవారు అయ్యో.. కోమటిరెడ్డి వందల కోట్లు ఖర్చు పెట్టలేదట అందుకే ఓడిపోయారట అనుకునే ఫీలింగ్ కలిగించారు. రాష్ట్ర నేతలతో సమన్వయం ఉంటే గెలిచేవారిమని రాజగోపాల్ రెడ్డి అనుచరులు చెబుతున్నారంటూ మరో కారణాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది.

సరే.. టీఆర్‌ఎస్‌కు 2018తో పోలిస్తే ఓట్లు ఏమైనా తగ్గాయా అంటే అదీ లేదు. 2018లో మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి 97,239 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి 74వేల 687 ఓట్లు వచ్చాయి. అప్పట్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 12వేల 725.

అదే ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటింగ్ 74,687 నుంచి 96వేల 826కి పెరిగింది. రాజగోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు 86వేల 709కు తగ్గాయి. మరి టీఆర్‌ఎస్‌కు గెలవడమే పదివేలుగా ఎలా మారిందో ఆంధ్రజ్యోతికే తెలియాలి. టీఆర్‌ఎస్‌కు సొంతంగా వచ్చిన ఓట్లు గతం కంటే ఈసారి పెరిగాయి.

First Published:  7 Nov 2022 10:55 AM IST
Next Story