Telugu Global
Telangana

వర్షాలకు కొట్టుకుపోయిన అందవెల్లి పెద్దవాగు తాత్కాలిక బ్రిడ్జ్

సిమెంట్ పైపులు వాగు ప్రవాహం ధాటికి నిలవలేకపోయాయి. తాత్కాలికంగా బ్రిడ్జ్ లాగా చేసిన ఏర్పాటు పూర్తిగా ధ్వంసమైంది. రాకపోకలు నిలిచిపోయాయి.

వర్షాలకు కొట్టుకుపోయిన అందవెల్లి పెద్దవాగు తాత్కాలిక బ్రిడ్జ్
X

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలతో తిప్పలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు అందవెల్లి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో 42 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలోని దహెగాం మండలం, కాగజ్ నగర్ మండలం మధ్య రాకపోకలకు ఏకైక ప్రత్యామ్నాయం అందవెల్లి పెద్దవాగు పై ఉన్న బ్రిడ్జ్. ఇటీవల ఇది కుంగిపోవడంతో కొత్త బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రజల రాకపోకలకు తాత్కాలికంగా వాగులోనుంచి రోడ్డు వేశారు. కింద సిమెంట్ పైపులు వేసి, దానిపై రోడ్డు వేశారు. వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా చూశారు. కానీ భారీ వర్షాలు ఈ రోడ్డుని ధ్వంసం చేశాయి. సిమెంట్ పైపులు వాగు ప్రవాహం ధాటికి నిలవలేకపోయాయి. తాత్కాలికంగా బ్రిడ్జ్ లాగా చేసిన ఏర్పాటు పూర్తిగా ధ్వంసమైంది. రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ తాత్కాలిక బ్రిడ్జ్ ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా అంతలోనే వర్షాలతో ఇది కొట్టుకుపోవడం విశేషం. మరోవైపు వర్షాల వల్లే శాశ్వత బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆలస్యమవుతోంది. బ్రిడ్జ్ లేకపోవడంతో 42గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం 11 జిల్లాలకు, మంగళవారం 10 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

First Published:  4 Sept 2023 8:00 AM IST
Next Story