Telugu Global
Telangana

సనత్‌నగర్‌లో ఆసక్తికర పోరు.. తండ్రి కొడుకులను ఎదుర్కోనున్న తలసాని?

సనత్‌నగర్ అనగానే మర్రి, తలసాని గుర్తుకు వస్తారు. 1989 నుంచి ఈ నియోజకవర్గం మర్రి ఫ్యామిలీకి పెట్టని కోటగా ఉన్నది.

సనత్‌నగర్‌లో ఆసక్తికర పోరు.. తండ్రి కొడుకులను ఎదుర్కోనున్న తలసాని?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ కసర్తతు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. బీజేపీ కూడా దరఖాస్తులను ఆహ్వానించగా.. దాదాపు 6 వేల మందికి పైగా టికెట్ల కోసం అప్లయ్ చేసుకున్నాయి. అయితే కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే పోరు ఆసక్తికరంగా మారబోతోందనే విషయం అర్థం అవుతోంది. జీహెచ్ఎంసీలో ఎక్కువ మంది ఫోకస్ చేసే సనత్‌నగర్ నియోజకవర్గం ఆసక్తికరమైన పోరుకు సిద్ధమవుతోంది.

సనత్‌నగర్ అనగానే మర్రి, తలసాని గుర్తుకు వస్తారు. 1989 నుంచి ఈ నియోజకవర్గం మర్రి ఫ్యామిలీకి పెట్టని కోటగా ఉన్నది. 1999-2004 మధ్యలో తప్ప 1989 నుంచి 2014 వరకు మర్రి కుటుంబమే సనత్‌నగర్‌లో ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చింది. 1989లో మర్రి చెన్నారెడ్డి సనత్‌నగర్ నుంచి గెలవగా.. 1992, 1994లో మర్రి శశిధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో శ్రీపతి రాజేశ్వర్ రావు టీడీపీ తరపున సనత్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009లో వరుసగా మర్రి శశిధర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అయితే మర్రి శశిధర్ రెడ్డి కోటను తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో బద్దలు కొట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ తరుపున తలసాని గెలవడం గమనార్హం. ఆ తర్వాత తలసాని బీఆర్ఎస్‌లో చేరి.. 2018లో అదే పార్టీ నుంచి గెలిచారు. ఇక సనత్‌నగర్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని తలసాని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి తలసానికి మర్రి కుటుంబం నుంచి ఇద్దరిని ఎదుర్కోవాల్సి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీలో సుదీర్గంగా కొనసాగిన మర్రి శశిధర్ రెడ్డి ఎన్నో పదవులు చేపట్టారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వంటి ఉన్నత పదవి కూడా ఆయనను వరించింది. అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత శశిధర్ రెడ్డి క్రమంగా పార్టీకి దూరమయ్యారు. చివరకు పార్టీకి రాజీమానా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ సారి బీజేపీ తరపున సనత్‌నగర్ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు.

తండ్రి పార్టీని వదిలి వెళ్లినా.. కుమారుడు మర్రి ఆదిత్య రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఈ సారి సనత్‌నగర్ నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంత కాలంగా సనత్‌నగర్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో తండ్రి ద్వారా ఉన్న పరిచయాలను వాడుకుంటూ.. నియోజకవర్గంలో సంబంధాలు పెంచుకుంటున్నారు. అయితే సనత్ నగర్ నుంచి టికెట్ కోసం కోటా నీలిమ కూడా దరఖాస్తు చేసుకున్నారు.

కోటా నీలిమ ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రటరీగానే కాకుండా ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నారు. ఏఐసీసీ మీడియా సెల్ చైర్మన్ పవన్ ఖేరాకు ఈమె సతీమణి. దీంతో టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే తనకు క్షేత్ర స్థాయిలో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయని.. చాలా కాలంగా నియోజకవర్గంలో తిరుగుతున్నానని మర్రి ఆదిత్య రెడ్డి చెబుతున్నారు. తనకు టికెట్ ఇస్తే తండ్రితో పాటు తలసానిని కూడా ఓడించి కాంగ్రెస్ పార్టీని తిరిగి నియోజకవర్గంలో నిలబెడతానని హామీ ఇస్తున్నారు.

మొత్తానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హ్యాట్రిక్ విజయం సాధించాలంటే మర్రి కుటుంబం నుంచే మళ్లీ గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కనుక ఆదిత్య రెడ్డికి టికెట్ ఇస్తే సనత్‌నగర్ పోరు ఆసక్తికరంగా మారుతుందని.. తండ్రి కొడుకులతో తలసాని పోరు తప్పకుండా చర్చనీయాంశం అవతుందని భావిస్తున్నారు.

First Published:  11 Sept 2023 7:31 AM IST
Next Story