Telugu Global
Telangana

ముందస్తు ఎన్నికలా? జాతీయ రాజకీయలపై ప్రకటనా? సెప్టెంబర్ 3న కేసీఆర్ క్లారిటీ ఇస్తారా?

సెప్టెంబర్ 3న నిర్వహించనున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి కేవలం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను మాత్రమే కాకుండా ఎంపీలను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడంతో ఏదో పెద్ద ప్రకటన రాబోతుందని అందరూ ఊహిస్తున్నారు.

ముందస్తు ఎన్నికలా? జాతీయ రాజకీయలపై ప్రకటనా? సెప్టెంబర్ 3న కేసీఆర్ క్లారిటీ ఇస్తారా?
X

తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 3న ఏం చేయబోతున్నారు? కేబినెట్ మీటింగ్, టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఒకే రోజు ఏర్పాటు వెనుక అసలు విషయం ఏమిటి? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ భేటీ నిర్వహించడం సర్వ సాధారణమైన విషయమే. ఇక అసెంబ్లీ సమావేశాలు ఉంటే మాత్రం టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ నిర్వహించి ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తుంటారు. కానీ ఇప్పుడు అకస్మాతుగా టీఆర్ఎస్ఎల్పీ సమావేశంతో పాటు కేబినెట్ భేటీ కూడా ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 3న నిర్వహించనున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి కేవలం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను మాత్రమే కాకుండా ఎంపీలను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడంతో ఏదో పెద్ద ప్రకటన రాబోతుందని అందరూ ఊహిస్తున్నారు.

సీఎం కేసీఆర్ గత కొన్నాళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పటి నుంచి కేసీఆర్ విమర్శలు మరింతగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రానికి సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని, ప్రాజెక్టులు కేటాయించడం లేదని పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు. ఇక ఇటీవల మునుగోడు బహిరంగ సభతో పాటు.. పలు జిల్లాల కలెక్టరేట్ల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో కూడా బీజేపీనే టార్గెట్ చేశారు. తెలంగాణకు ఆ పార్టీ ఒక పెద్ద ప్రమాదకారి అనే రీతిలో కేసీఆర్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ మాటలు జనాల్లోకి కూడా విస్తృతంగా చొచ్చుకొని పోయాయి. హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నించిన విషయాన్ని కేసీఆర్ సహా టీఆర్ఎస్ నాయకులు కూడా హైలైట్ చేశారు.

తెలంగాణ సర్కారును కూల్చేందుకు మాకు కూడా ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించడం, ఆ వెంటనే మత కల్లోల్లాలకు బీజేపీ ఆజ్యం పోయడంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రతిపక్షాలు ఓకే అంటే ముందస్తు ఎన్నికలకు సిద్దమే అని ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో కూడా కేసీఆర్ చెప్పారు. బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుండటం, మతకల్లోలాల వంటి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని కేసీఆర్.. టీఆర్ఎస్ సీనియర్ నేతలు, సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుంటేనే మంచిదనే సూచనలు వచ్చాయని.. అందుకే టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారనే వాదన వినిపిస్తోంది. ముందుగా లెజిస్లేటీవ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల సూచనలు తీసుకున్న తర్వాత.. ఆ విషయంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటారని పలువురు అంటున్నారు.

మరోవైపు జాతీయ రాజకీయాల గురించి కూడా కేసీఆర్ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులు కూడా కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ స్థాయిలో కావాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తనను జాతీయ స్థాయి రాజకీయాల్లోకి రమ్మంటున్నారని.. వెళ్లమంటారా అని పెద్దపల్లి జిల్లాలో జరిగిన సభలో కేసీఆర్ ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వాన్ని కూల్చే రైతు ప్రభుత్వం వస్తుందని కూడా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసే విషయంపై కూడా సెప్టెంబర్ 3న జరిగే సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తున్నది. జాతీయ పార్టీగా మారితే వచ్చే సాదకబాధకాల గురించి కూడా అభిప్రాయాలు సేక‌రించే అవకాశం ఉన్నది. అదే రోజు కేసీఆర్ ముందస్తు ఎన్నికలు, జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నాటి నుంచే ఈ విషయంపై గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లు సమాచారం. ఏదేమైనా సెప్టెంబర్ 3న రాష్ట్ర, దేశ రాజకీయాలకు సంబంధించి ఓ కీలక ప్రకటన మాత్రం వెలువడే అవకాశం ఉన్నది.

First Published:  31 Aug 2022 7:47 AM IST
Next Story