Telugu Global
Telangana

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

తుపాను కారణంగా అమిత్ షా తన పర్యటన రద్దు చేసుకోవడంతో ఈ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
X

తెలంగాణలో నిర్వహించాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయ్యింది. బిపోర్ జాయ్ తుపాను కారణంగా సహాయక చర్యలు పర్యవేక్షించాల్సి ఉండటంతో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాత్రి హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో భేటీ, అనంతరం ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది.

తుపాను కారణంగా అమిత్ షా తన పర్యటన రద్దు చేసుకోవడంతో ఈ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. రేపటి సభకు జరుగుతున్న ఏర్పాట్లను నిలిపివేయాల్సిందిగా నిర్వాహకులను బీజేపీ నాయకులు కోరారు. హైదరాబాద్ కు రాకపోయినప్పటికీ రేపటి ఖమ్మం సభకు అయిన నేరుగా హాజరుకావాలని రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆయన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.

బిపోర్ జాయ్ తుపాను ముంచుకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిరంతరం సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ కారణంగానే తెలంగాణ పర్యటనను వాయిదా వేసుకున్నారు. మళ్లీ అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తారని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.

బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి, జూపల్లిలను బీజేపీలో చేర్చుకునేందుకు ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. పలు దఫాలు వారితో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖమ్మంలో బీజేపీకి బలం లేకపోవడం వల్లే పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రేపటి ఖమ్మం సభను విజయవంతం చేసి ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని బీజేపీ నాయకులు భావించారు. ఇప్పుడు అమిత్ షా పర్యటన వాయిదా పడటంతో ఆ పార్టీ శ్రేణులు ఢీలాపడ్డాయి.

First Published:  14 Jun 2023 12:46 PM GMT
Next Story