Telugu Global
Telangana

అమిత్ షా పర్యటనలో మళ్లీ మార్పులు

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మోదీ-షా ద్వయం వరుసగా పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని మోదీ వచ్చి వెళ్లారు, ఇప్పుడు హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు.

అమిత్ షా పర్యటనలో మళ్లీ మార్పులు
X

అమిత్ షా తెలంగాణ పర్యటనలో మళ్లీ మార్పులు జరిగాయి. వాస్తవానికి అమిత్‌ షా గతనెలలోనే తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ టూర్ రద్దయింది. పరిస్థితులు చక్కబడటంతో అమిత్ షా బహిరంగ సభకు ఆదివారం మహూర్తం నిర్ణయించారు. ముందుగా భద్రాచలంలో రాములవారి దర్శనం అనంతరం ఖమ్మంలో బహిరంగ సభ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు భద్రాచలం పర్యటన క్యాన్సిల్ అయింది. నేరుగా ఖమ్మంకు వచ్చి అటునుంచి అటే తిరుగు ప్రయాణం అవుతారు అమిత్ షా.

ఆదివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగుతారు అమిత్ షా. అక్కడి నుంచి హెలికాప్టర్‌ లో నేరుగా ఖమ్మంకు వస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం 4.40 గంటలకు పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌ జరుగుతుంది. 5.40 గంటలకు ఖమ్మం నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్టుకు బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌ కు వెళ్తారు అమిత్ షా.

సమరభేరి మోగిస్తారా..?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మోదీ-షా ద్వయం వరుసగా పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని మోదీ వచ్చి వెళ్లారు, ఇప్పుడు హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు. ఖమ్మం సభలో అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ఏ స్థాయిలో విమర్శలు ఎక్కుపెడతారో చూడాలి. కాంగ్రెస్ ని లెక్కలోకి తీసుకోలేం అని బీజేపీ చెబుతున్నా.. హస్తం పార్టీనుంచి వారికి గట్టి పోటీ ఉంది. మరి షా పర్యటన బీజేపీలో ఉత్సాహం నింపుతుందో లేదో వేచి చూడాలి.

First Published:  26 Aug 2023 10:40 PM IST
Next Story