Telugu Global
Telangana

తెలంగాణ బీజేపీ నాయకులపై అమిత్ షా ఆగ్రహం? నేడు ఢిల్లీకి రావాలని పిలుపు!

'విజన్ 90' పేరుతో అధిష్టానం రాష్ట్ర బీజేపీకి ఒక కార్యచరణ ఇచ్చింది. కానీ దానిని అమలు చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని ఆగ్రహంగా ఉన్నది.

తెలంగాణ బీజేపీ నాయకులపై అమిత్ షా ఆగ్రహం? నేడు ఢిల్లీకి రావాలని పిలుపు!
X

తెలంగాణ బీజేపీ నాయకులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహంగా ఉన్నారా? రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారా? అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తం అవడంలో వెనుకబడ్డారని ఆయన భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికలకు మరి కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి పలు కార్యక్రమాలు రూపొందించింది. 'విజన్ 90' పేరుతో అధిష్టానం రాష్ట్ర బీజేపీకి ఒక కార్యచరణ కూడా ఇచ్చింది. కానీ దానిని అమలు చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని అధిష్టానం ఆగ్రహంగా ఉన్నది.

ఇటీవల మూడంచెల వ్యూహం పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 వేల సభలను నిర్వహించి క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే మొదటి రోజు బాగనే నిర్వహించిన బీజేపీ నాయకులు.. ఆ తర్వాత కార్నర్ మీటింగ్స్‌ను గాలికి వదిలేశారు. ప్రజల వద్ద నుంచి కనీస స్పందన లేకపోవడంతో నాయకులు కూడా అటు వైపు చూడలేదు. దీనిపై అప్పుడే జాతీయ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వైపు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ర్యాలీలు, సభలకు ప్లాన్ చేశారు. కానీ వాటి ప్రణాళిక సరిగా లేదని హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఒకవైపు రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా బీజేపీకి అనుకున్నంత మైలేజీ రావడం లేదు. ప్రజల్లో కూడా బీజేపీకి తగినంత ఆదరణ లభించడం లేదు. దీంతో రాష్ట్ర నాయకత్వం యొక్క అసమర్దతపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కే. లక్ష్మణ్, విజయశాంతి.. ఇతర ముఖ్య నేతలకు పిలుపు వచ్చింది. తెలంగాణలో అమలు చేస్తున్న విజన్ 90 పైనే ఈ సమావేశంలో కీలక చర్చ జరుగనున్నది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమాయత్తానికి తీసుకోవల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తున్నది. ఎన్నికల విషయంలో రాష్ట్ర నాయకత్వం ఎలా వ్యవహరించాలో కూడా అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని సమాచారం. అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ తరపున పోటీ చేసే వారిని గుర్తించే ప్రక్రియ ఎలా చేపట్టాలో కూడా అమిత్ షా సూచించనున్నారు. మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నది.

కాగా, మార్చిలో తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పదవీ కాలం ముగియనున్నది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా లేదంటే బండి సంజయ్‌నే కొనసాగిస్తారా అనే చర్చ జరుగుతున్నది. కాగా, కొన్ని నెలల్లో ఎన్నికల ఉన్నందున సంజయ్‌ను మరి కొంత కాలం కొనసాగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  28 Feb 2023 8:00 AM IST
Next Story