Telugu Global
Telangana

అమిత్ షా సభలో కొత్త పాయింట్ ఏంటంటే..?

అభ్యర్థుల ప్రకటన లేకపోవడంతో బీజేపీ సభలు వెలవెలబోతున్నాయి. కనీసం అభ్యర్థులను ప్రకటించి ఉంటే.. జనసమీకరణ జరిగేది. ఆదిలాబాద్ సభకు జనం పలుచనయ్యారు. పేరుకే అది జనగర్జనగా మిగిలిపోయింది.

అమిత్ షా సభలో కొత్త పాయింట్ ఏంటంటే..?
X

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్ పై కొత్త నింద వేసి వెళ్లారు. ఎన్డీఏలో చేరేందుకు ఆయన ఉత్సాహం చూపించారని, కేటీఆర్ ని సీఎం చేసే ప్రతిపాదన తన దగ్గర తెచ్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు గట్టిగానే సమాధానం చెప్పారనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణకు వచ్చిన అమిత్ షా కూడా అదే పాట పాడారు. కేటీఆర్ ని సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. పదేళ్లుగా తెలంగాణని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత తొలిసారి ఆదిలాబాద్ సభలో పాల్గొన్నారు అమిత్ షా.

డబుల్ ఇంజిన్ రావాల్సిందే..

అమిత్ షా సభ పేలవంగా జరిగింది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పడం మినహా.. ఆయన ఇంకేమీ చెప్పలేకపోయారు. డబుల్ ఇంజిన్ వస్తే డబుల్ అభివృద్ధి జరుగుతుందన్నారు కానీ.. ఆల్రడీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ప్రజల అష్టకష్టాలకు సమాధానం చెప్పుకోలేకపోయారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు కానీ, పేదలకోసం ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రకటించలేకపోయారు. ప్రధాని మోదీ ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేశారంటున్నారే కానీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని బీసీనుంచి ఓసీకి ఎందుకు మార్చారో చెప్పలేకపోయారు.


షా వచ్చినా, చప్పగానే..

అభ్యర్థుల ప్రకటన లేకపోవడంతో బీజేపీ సభలు వెలవెలబోతున్నాయి. కనీసం అభ్యర్థులను ప్రకటించి ఉంటే.. భారీగా జనసమీకరణ జరిగేది. ప్రధాని మోదీ సభల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్న పేరయినా ఉంది. అమిత్ షా ది పూర్తిగా పొలిటికల్ మీటింగ్ కావడంతో ఆదిలాబాద్ సభకు జనం పలుచనయ్యారు. పేరుకే అది జనగర్జనగా మిగిలిపోయింది.

First Published:  10 Oct 2023 12:02 PM GMT
Next Story