Telugu Global
Telangana

పార్టీలో చేరికలు ఏవి.. ఈటలపై అమిత్ షా ఫైర్?

ఇప్పటి వరకు చేరికల కమిటీ చైర్మన్‌గా చేసిన పని ఏంటని ఈటలను అమిత్ షా నేరుగా ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీలో చేరికలు ఏవి.. ఈటలపై అమిత్ షా ఫైర్?
X

తెలంగాణలో బీజేపీ పరిస్థితి చూసి పార్టీ అధిష్టానానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. పైకి ధీమాగా.. రాబోయే ఎన్నికల్లో తమదే విజయం అని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. రాష్ట్రంలో పార్టీని ఎన్నికల్లో గెలిపించగలిగే నాయకుడు ఒక్కరు కూడా లేకపోవడం హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారింది. బండి సంజయ్ కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప.. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులను అన్వేషించడానికి సమయం కేటాయించడం లేదని పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులను భారీగా చేర్చుకోవాలని బీజేపీ ఏనాడో వ్యూహం సిద్ధం చేసింది. చేరికల కమిటీకి చైర్మన్‌గా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను నియమించింది. కానీ, ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎలాంటి ప్రజా బలం, చరిష్మాలేని బూర నర్సయ్య గౌడ్ వంటి నేతలను ఒకరిద్దరిని తప్ప.. పార్టీలోకి ఎవరినీ తీసుకొని రాలేకపోయారు. దీనిపై ఇప్పటికే అధిష్టానం ఆగ్రహంగా ఉన్నది.

ఇక అమిత్ షా చేవెళ్లలో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరతారని సమాచారం ఇచ్చారు. అసలు వాళ్లిద్దరూ పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారా లేదా అని పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అమిత్ షాకు చెప్పడంతో ఆయన తెలంగాణ పర్యటన పెట్టుకున్నారు. తీరా చేవెళ్ల సభలో వారిద్దరు చేరనే లేదు. బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్ అయిన సదరు నేతలు.. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవగా.. ఆ విషయం తెలుసుకోకుండా తనను పిలిచినందుకు ఈటలకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది.

ఇప్పటి వరకు చేరికల కమిటీ చైర్మన్‌గా చేసిన పని ఏంటని ఈటలను నేరుగా ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలు వస్తున్నారని తనను పిలిచి.. ఇప్పుడు చేతులెత్తేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కమిటీ వల్ల పెద్దగా ప్రయోజనం లేదు అని అమిత్ షా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

రాష్ట్ర నేతల మధ్య ఉన్న మనస్పర్థలపై కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది. పట్టుమని పది మంది నేతలు కూడా లేరు. మీ మధ్యే సఖ్యత లేకుండా.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఎలా చెబుతున్నారని గట్టిగానే అడిగినట్లు తెలుస్తున్నది. మీ మధ్య అసలు సమన్వయం లేదని.. పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈటల ఈ విషయంలో బాధపడినట్లు తెలుస్తున్నది. తనకు చేరికల కమిటీ బాధ్యతలు వద్దని అమిత్ షాకు చెప్పినట్లు సమాచారం. అయితే, రాష్ట్ర నాయకులు ఆయనను బుజ్జగించడంతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. కీలక సమయంలో బాధ్యతల నుంచి తప్పుకుంటే పార్టీ పరంగా నష్టం జరుగుతుందని, కార్యకర్తల్లో కూడా గందరగోళం ఏర్పడుతుందని ఈటలకు చెప్పి బుజ్జగించినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.

First Published:  27 April 2023 8:21 AM IST
Next Story