కేసీఆర్ నెత్తిన అమిత్ షా పాలుపోశారా?
ఇంతకీ అమిత్ షా చేసిన ప్రకటన ఏమిటంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తారట. ఇప్పుడు ముస్లింలకు కేసీఆర్ అమలుచేస్తున్న 4 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా చెప్పటమే విచిత్రంగా ఉంది.
తెలంగాణ మెరుపు పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో కేసీఆర్ నెత్తిన అమిత్ షా పాలు పోశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ అమిత్ షా చేసిన ప్రకటన ఏమిటంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తారట. ఇప్పుడు ముస్లింలకు కేసీఆర్ అమలుచేస్తున్న 4 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా చెప్పటమే విచిత్రంగా ఉంది.
కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుంటే మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఏమి చేస్తున్నారు? ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ఈ విషయం తెలియదా? పోనీ వీళ్ళకు ఏమీ తెలియదనే అనుకుందాం మరి సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏమి చేస్తున్నట్లు? ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధమైన పాలన చేస్తుంటే మిగిలిన వ్యవస్థలన్నీ ఏమి చేస్తున్నాయ్? సరే హోంశాఖ మంత్రి ఏ ఉద్దేశంతో చెప్పినా అది రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు అడ్వాంటేజ్ అవుతుందనే చర్చ మొదలైంది.
ఎలాగంటే తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓల్డ్ సిటితో పాటు రంగారెడ్డి జిల్లాలో చాలా ఎక్కువగానే ఉన్నారు. అలాగే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ముస్లిం జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నది. వీళ్ళంతా రేపు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పుడు ఎలాగూ ముస్లిం ఓట్లు బీజేపీకి రావటంలేదని అమిత్ షా లెక్కేసుకున్నారేమో. ముస్లిం ఓట్లు కావాలంటే ఏవైనా పథకాలు ప్రకటిస్తే ముస్లింల్లోని కొందరైనా బీజేపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయి. అంతేకానీ ఉన్న రిజర్వేషన్లను కూడా లాగేసుకుంటామంటే ముస్లింలు మరింతగా రెచ్చిపోయి బీజేపీకి వ్యతిరేకంగా వేయరా? అయినా ఈ విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి ప్రకటనే కర్నాటకలో కూడా చేశారు. కర్నాటకలోని 4 శాతం రిజర్వేషన్లను రద్దుచేసి ఒక్కలిగలు, లింగాయతులకు సర్దుబాటు చేశారు. మరి దాని ఫలితం తొందరలోనే వచ్చేస్తుంది. చూద్దాం అక్కడేమవుతుందో?