Telugu Global
Telangana

గేలాలు రెడీ చేసుకోండి.. తెలంగాణ బీజేపీ నేతలకు షా సూచన

చేరికలతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయండని చెబుతున్నారు. పక్క పార్టీల్లోనుంచి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు గేలమేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

గేలాలు రెడీ చేసుకోండి.. తెలంగాణ బీజేపీ నేతలకు షా సూచన
X

ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేసి కొనుగోలు చేయాలని చూసి అడ్డంగా బుక్కైనా కూడా ఇంకా బీజేపీకి బుద్ధి వచ్చినట్టు లేదు. తాజాగా తెలంగాణ పర్యటనలో అమిత్ షా చేరికలకోసమే హడావిడి చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు టార్గెట్లు పెట్టారని తెలుస్తోంది. చేరికలపై దృష్టి పెట్టాలని హితబోధ చేశారు. సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నాయకులతో ఎక్కువ సమయం గడిపారు.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలలో ఒకరు అరువు తెచ్చుకున్న వారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డితో ఆడిన డ్రామా రక్తికట్టలేదంతే, లేకపోతే ఉన్నవారిలో సగం అరువు బ్యాచ్ అయి ఉండేవారు. అయితే అక్కడితో అమిత్ షా ఆగడంలేదు. ఇంకా ఇంకా కావాలంటున్నారు. చేరికలతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయండని చెబుతున్నారు. పక్క పార్టీల్లోనుంచి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు గేలమేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యారు అమిత్ షా. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ తో ఆయన సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తెలంగాణ రాజకీయాలపై బండి సంజయ్‌, అమిత్‌ షాకు ఒక నివేదిక అందించినట్టు తెలుస్తోంది. సంజయ్‌ అందించిన ఆ నివేదికపై చర్చ జరిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, నేతలు మరింత కలిసికట్టుగా పనిచేస్తే అధికారం తథ్యమని అమిత్ షా చెప్పినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా చేరికలపై దృష్టిపెట్టాలని కూడా అమిత్ షా చెప్పారని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే టైమ్ ఉండటంతో.. ముందు చేరికలతో పెద్ద నాయకులను ఆహ్వానించి, ఆ తర్వాత టికెట్లు ఖరారు చేయాలనుకుంటోంది బీజేపీ.

First Published:  12 March 2023 7:15 PM IST
Next Story