Telugu Global
Telangana

హైదరాబాద్ లో అంబులెన్స్ ఘోరం..

రోగికి ప్రాణం పోయాల్సిన ఆక్సిజన్ సిలిండర్, డ్రైవర్ మరణానికి కారణం అయింది. అంబులెన్స్‌ డ్రైవర్‌ మహేష్, స్పాట్ లోనే మృతిచెందాడు.

హైదరాబాద్ లో అంబులెన్స్ ఘోరం..
X

హైదరాబాద్ లో ప్రైవేట్ అంబులెన్స్ ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఆమధ్య ఓ అంబులెన్స్ డ్రైవర్, రోగులు లేకపోయినా సైరన్ వేసుకుంటూ వెళ్లి తీరిగ్గా ఓ బజ్జీల కొట్టు వద్ద ఆగి పార్శిల్ కట్టించుకున్న వ్యవహారం కలకలం రేపింది. తాజాగా మరో ప్రైవేట్ అంబులెన్స్ ఘోర ప్రమాదానికి గురైంది. ఇక్కడ కూడా అంబులెన్స్ లో రోగులెవరూ లేకపోవడం విశేషం. అయితే డ్రైవర్ అతివేగం ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా.. అంబులెన్స్ విధ్వంసం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అతడి ఇంటి వద్ద వదిలిపెట్టి తిరిగి వస్తుండగా అంబులెన్స్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అంబులెన్స్‌ డ్రైవర్‌ మహేష్, స్పాట్ లోనే మృతిచెందాడు. నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్‌ చౌరస్తా వద్ద ఈ ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

పేలిన ఆక్సిజన్ సిలిండర్..

అంబులెన్స్ లో ఎప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. రోగికి ప్రాణం పోయాల్సిన ఆ సిలిండర్, డ్రైవర్ మరణానికి కారణం అయింది. మలక్‌ పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అంబులెన్స్‌ లో ఇబ్రహీంపట్నంలోని అతడి ఇంటికి తీసుకెళ్లాడు డ్రైవర్ మహేష్. తిరిగి వస్తుండగా సాగర్‌ రోడ్ పై బీఎన్ రెడ్డి చౌరాస్తా వద్దకు రాగానే అతి వేగం కారణంగా అంబులెన్స్ అదుపు తప్పింది. డివైడర్ ని ఢీకొని పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అక్కడితో ప్రమాదం ముగిసిపోలేదు. ఆ ప్రమాద ధాటికి ఆక్సిజన్ సిలిండర్ ఒత్తిడికి గురైంది. ఆ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి కొన ఊపిరితో ఉన్న డ్రైవర్ దుర్మరణంపాలయ్యాడు. అంబులెన్స్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు.

First Published:  25 July 2023 5:31 AM GMT
Next Story