Telugu Global
Telangana

నేడే అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ:ఇది యావత్‌ జాతి గర్వించదగ్గ ఘట్టమన్న‌ కేసీఆర్‌

ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవాలనే తత్వానికి భారత రాజ్యాంగ నిర్మాత జీవితమే నిదర్శనమని, చిన్నతనం నుంచి కులం, అంటరానితనం పేరుతో వివక్షను ఎదుర్కొన్నప్పటికీ, అంబేద్కర్ ఒక్క అడుగు కూడా వెనక్కి తీసుకోలేదని, విజయాన్ని సాధించేందుకు ముందుకే నడిచారని ముఖ్యమంత్రి అన్నారు.

నేడే అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ:ఇది యావత్‌ జాతి గర్వించదగ్గ ఘట్టమన్న‌ కేసీఆర్‌
X

ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన 125 అడుగుల విగ్రహావిష్కరణ చేస్తుండటం తెలంగాణకే కాదు, యావత్ జాతికి గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవాలనే తత్వానికి భారత రాజ్యాంగ నిర్మాత జీవితమే నిదర్శనమని, చిన్నతనం నుంచి కులం, అంటరానితనం పేరుతో వివక్షను ఎదుర్కొన్నప్పటికీ, అంబేద్కర్ ఒక్క అడుగు కూడా వెనక్కి తీసుకోలేదని, విజయాన్ని సాధించేందుకు ముందుకే నడిచారని ముఖ్యమంత్రి అన్నారు.

అంబేద్కర్ గొప్ప‌ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరచడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నదని కేసీఆర్ అన్నారు.

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడంలో భాగంగా నూతన రాష్ట్ర సచివాలయ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని నామకరణం చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, దళితులకు గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య, షెడ్యూల్డ్ కులాలు, తెగల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సహాయం, దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి టిఎస్ ప్రైడ్... తదితర కార్యక్రమాలు ఆమలు చేస్తున్నద‌ని కేసీఆర్ తెలిపారు.

దళిత బంధు ఒక విప్లవాత్మక పథకమని, దీని కింద లబ్ధిదారులు తమకు అందించిన రూ.10 లక్షల సాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రక్షణ నిధిని ఏర్పాటు చేసిందన్నారు.

దళిత బంధు ద్వారా లబ్ధిదారులు సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, దళితులు ఇతరులకన్నా తక్కువ కాదని వారి విజయాలు నిరూపించాయని అన్నారు.

ఈ విజయగాథల ద్వారా తెలంగాణ దళిత సమాజం భారతదేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా దళితుల సంక్షేమం కోసం కృషి కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.

First Published:  14 April 2023 8:05 AM IST
Next Story