Telugu Global
Telangana

అంబేద్కర్ స్మృతి వనం.. నెల రోజుల్లో సందర్శకులకు అనుమతి

11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్మృతి వనాన్ని సందర్శకులకు మధురానుభూతిగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

అంబేద్కర్ స్మృతి వనం.. నెల రోజుల్లో సందర్శకులకు అనుమతి
X

హైదరాబాద్‌లోని సాగర తీరాన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనం త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానున్నది. బాబా సాహెబ్ జయంతి నాడు (ఏప్రిల్ 14) ఆయన మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ సమక్షంలో సీఎం కేసీఆర్ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేవలం విగ్రహమే కాకుండా అక్కడ లైబ్రెరీ, నాలెడ్జ్ సెంటర్, రాక్ గార్డెన్, పార్క్, మినీ థియేటర్ వంటివి కూడా అభివృద్ధి చేశారు. అయితే పలు మౌలిక సదుపాయాల కల్పన ఇంకా పూర్తి కానందున సందర్శకులను లోపలికి అనుమతించడం లేదు.

భారీ అంబేద్కర్ విగ్రహాన్ని చూడటానికి వచ్చిన వాళ్లు.. బయట గేటు వద్దే ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారు. విగ్రహం కింద నిర్మించిన భారీ హాలులో 100 మంది కూర్చొనే థియేటర్ కూడా ఉంది. ఇందులో ప్రతీ రోజు అంబేద్కర్ జీవిత చరిత్రకు చెందిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. ఆయన కెరీర్‌కు సంబంధించి అరుదైన ఫొటోల ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ హాలు నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. అలాగే ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్మృతి వనాన్ని సందర్శకులకు మధురానుభూతిగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

పెండింగ్ పనులన్నీ మరో నెల రోజుల్లోపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో స్మృతి వనం ఓపెన్ అవుతుందని చెబుతున్నారు. అయితే టికెట్ ఉంటుందా.. లేదా.. అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి అయితే లోపల టికెట్ కౌంటర్లు కూడా నిర్మించారు. కానీ, మొదట్లో ఉచితంగానే సందర్శకులను అనుమతిస్తారని భావిస్తున్నారు. దీనిపై కొన్ని రోజుల్లోనే స్పష్టత రానున్నది.

First Published:  20 April 2023 9:28 AM IST
Next Story