ఓటర్ల వింత నిరసన.. ఖాళీగా పోలింగ్ బూత్
గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించడంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
సహజంగా ఎక్కువ ఓట్లు పోల్ అయితే ఆయా పోలింగ్ బూత్ లు వార్తల్లోకెక్కుతాయి. కానీ అసలు పోలింగే లేకుండా తెలంగాణలో ఓ పోలింగ్ కేంద్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఓ గిరిజన గ్రామం కావడం విశేషం. ఇంతకీ ఆ పోలింగ్ కేంద్రం ఎందుకు ఖాళీగా ఉంది, సిబ్బందికి పనిలేకుండా చేసి నిరసన తెలిపిన ఆ ఊరి సమస్య ఏంటి..?
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెంలో మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు లాంటి సమస్యలు కూడా ఉన్నాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని, కరెంట్ లేకపోవడంతో పాము కాటుకు గురి కావాల్సివస్తోందని తెలిపారు. విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులు అడుగుతారు కాని, కరెంటు మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సీజన్ కావడంతో వారంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఓటు వేయకుండా గ్రామంలోనే బైఠాయించి తమ నిరసన తెలిపారు.
గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించడంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యుత్ సిబ్బంది హుటాహుటిన చెంచు గూడెంకు చేరుకున్నారు. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్థులు మాత్రం బెట్టువీడలేదు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇస్తే కానీ ఓటు వేయడానికి రాలేమని తేల్చి చెబుతున్నారు.