Telugu Global
Telangana

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆలోక్ అరాధే నియామకం

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంతో ఆ స్థానంలో కొలీజియం జస్టిస్ అలోక్ అరాధే పేరు సిఫార్సు చేసింది.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆలోక్ అరాధే నియామకం
X

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 5న చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్ తెలిపారు. ఇక తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్ శ్యాంకోశిని నియమించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గడ్ హైకోర్టులో పని చేస్తున్న శ్యాంకోశి.. తనను బదిలీ చేయాలని కొలీజియంకు విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు ప్రతిపాదించగా.. అక్కడికి తప్ప ఎక్కడికైనా బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో శాంకోశిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంతో ఆ స్థానంలో కొలీజియం జస్టిస్ అలోక్ అరాధే పేరు సిఫార్సు చేసింది. జస్టిస్ అలోక్ అరాధే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో పని చేస్తున్నారు. జస్టిస్ అలోక్ అరాధే 1964 ఏప్రిల్ 13న రాయ్‌పూర్‌లో జన్మించారు. 1988 జూలై 12న అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. 2007లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు.

2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమించబడ్డారు. 2011 ఫిబ్రవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016 సెప్టెంబర్ 16న జమ్మూ కశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018 మే 11 నుంచి అగస్టు 10 వరకు అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2018 నవంబర్ 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మూడు నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు.

తెలంగాణతో పాటు మరో గుజరాత్, కేరళ, ఒడిషా హైకోర్టులకు కూడా ప్రధాన న్యాయమూర్తులు నియామకం అయ్యారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలాహాబద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆశిశ్ జే దేశాయ్‌ని కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిస్ తలపాత్రను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ మురళీధర్ ఈ ఏడాది అగస్టు 7న పదవీ విరమణ చేసిన తర్వాత.. తలపాత్ర సీజేగా బాధ్యతలు చేపడతారు.

First Published:  20 July 2023 2:03 AM GMT
Next Story