Telugu Global
Telangana

హైదరాబాద్ లో అల్లూరి ఘనకీర్తి.. ఆ పాట ఉద్యమ స్ఫూర్తి

ఆదివాసీలపై జరిగిన అఘాయిత్యాలపై అల్లూరి చేసిన తిరుగుబాటు బ్రిటిష్‌ వారిని గడగడలాడించిందని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అల్లూరి జన్మించిన చింతపల్లిలో ధ్యాన మందిరం, స్మారకం నిర్మిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్ లో అల్లూరి ఘనకీర్తి.. ఆ పాట ఉద్యమ స్ఫూర్తి
X

హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా, సీఎం కేసీఆర్‌ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం దేశ ప్రజలకు నిత్య స్ఫూర్తి అని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్వాతంత్ర సమరంలో ఆయనది చిరస్థాయిగా నిలిచిపోయే పోరాటమని కొనియాడారు. దేశ ఆత్మగౌరవం కోసం భగత్‌ సింగ్‌ ఏ స్థాయిలో పోరాటం చేశారో, అదే స్థాయిలో తెలుగునేల మీద అల్లూరి వీరోచిత పోరాటం చేశారని అన్నారు. ఆదివాసీలపై జరిగిన అఘాయిత్యాలపై అల్లూరి చేసిన తిరుగుబాటు బ్రిటిష్‌ వారిని గడగడలాడించిందని అన్నారు. అల్లూరి జన్మించిన చింతపల్లిలో ధ్యాన మందిరం, స్మారకం నిర్మిస్తున్నామని చెప్పారు.

ఆ పాట స్ఫూర్తినిచ్చింది..

అహింసే ఆయుధమన్న మహాత్మాగాంధీ కూడా అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటాన్ని ప్రశంసించకుండా ఉండలేను అనడం అల్లూరి గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. నాడు సినీనటుడు కృష్ణ రూపొందించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా.. మా నిదురించిన పౌరుషాన్ని రగిలించిన వాడా’ అనే పాట చాలా పాపులర్‌ అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు తాను ఆ పాటను వింటూ స్ఫూర్తి పొందానని చెప్పారు కేసీఆర్. అల్లూరిది చాలా గొప్ప చరిత్ర అని, అంత చిన్న వయస్సులో అంత గొప్ప ప్రేరణ కలగడం ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. ప్రజలపై పీడన, సమాజంలో దోపిడీ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో దైవాంశ సంభూతులు పుడతారని, ‘సంభవావి యుగే యుగే ’ అనే మాటలు, 26 ఏళ్ల అతిపిన్న వయస్సులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితానికి నిజంగా వర్తిస్తాయని అన్నారు సీఎం కేసీఆర్.


రాష్ట్రపతికి వీడ్కోలు..

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. కార్యక్రమం అనంతరం తిరిగి హకీంపేటనుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

First Published:  5 July 2023 6:47 AM IST
Next Story