Telugu Global
Telangana

ఎంపీ టికెట్ల కేటాయింపు.. 3 పార్టీల్లో ఇంత తేడానా..?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌ పార్టీకి కనువిప్పు కలిగినట్లే కనిపిస్తోంది. అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తూ టికెట్లు కేటాయించారు గులాబీ బాస్ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ యాదవ సామాజికవర్గానికి రెండు టికెట్లు ఇచ్చింది.

ఎంపీ టికెట్ల కేటాయింపు.. 3 పార్టీల్లో ఇంత తేడానా..?
X

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై తీవ్ర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్‌ పార్టీ అందరికంటే ముందుగానే 17 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మరో జాతీయపార్టీ బీజేపీ కూడా అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అధికార కాంగ్రెస్‌ మాత్రం 14 స్థానాలకే క్యాండిడేట్లను ఎంపిక చేసింది. ఇంకా 3 స్థానాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాల అంశం తెరపైకి వచ్చింది.

అధికార కాంగ్రెస్‌లో సామాజిక సమీకరణాలు కుదరలేదనే చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు మాదిగ, యాదవ, గౌడ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్‌ కూడా కేటాయించలేదు. నాగర్ కర్నూల్ లోక్ సభ సీటు కోసం మల్లు రవి (మాల), సంపత్ కుమార్ (మాదిగ) పోటీ పడగా చివరికి మల్లు రవికే టికెట్ ఇచ్చింది. పెద్దపల్లి టికెట్ సైతం మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీ కృష్ణకే ఇచ్చారు. వరంగల్ ఎంపీ టికెట్ అయినా మాదిగ సామాజికవర్గానికి కేటాయిస్తారని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీహరిని తీసుకుని ఆయన కూతురు కడియం కావ్య (బైండ్ల)కి కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మీద మాదిగ సామాజిక వర్గం గుర్రుగా ఉంది.

ఇదే కోవలో ఇప్పటివరకు ప్రకటించిన 14 ఎంపీ టికెట్లలో యాదవ, గౌడ సామాజికవర్గానికి ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ మూడు స్థానాలు మాత్రమే పెండింగ్ ఉండగా అసలు గెలిచే అవకాశమే లేని హైదరాబాద్ స్థానంలో గౌడ లేదా యాదవ సామాజికవర్గానికి కేటాయించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ కూడా యాదవ సామాజికవర్గానికి ఒక్క ఎంపీ టికెట్ అయినా కేటాయించలేదు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌ పార్టీకి కనువిప్పు కలిగినట్లే కనిపిస్తోంది. అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తూ టికెట్లు కేటాయించారు గులాబీ బాస్ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ యాదవ సామాజికవర్గానికి రెండు టికెట్లు ఇచ్చింది. భువనగిరి నుంచి క్యామ మల్లేష్ యాదవ్‌ను హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను బరిలో నిలిపింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన పద్మారావు గౌడ్‌ను సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయిస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌కు చేవెళ్ల టికెట్ ఇచ్చారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌కు అవకాశం ఇచ్చారు. మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ జహీరాబాద్‌ నుంచి గాలి అనిల్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను పోటీలో ఉంచింది. మాదిగ సామాజికవర్గం నుంచి నాగర్‌కర్నూల్‌ బరిలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను నిలిపారు. ఇలా అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ గతంలో జరిగిన తప్పులు సరిద్దుకుంటూ టికెట్లు కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ.

First Published:  2 April 2024 5:51 AM GMT
Next Story