నేను సీఎం, నీకు రెవెన్యూ.. రేవంత్ రెడ్డి అడ్వాన్స్ లు..?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని చెప్పిన రేవంత్ రెడ్డి.. రెవెన్యూ మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ గాలి అనిల్ కుమార్ వద్ద 12 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆలూ లేదూ చూలూ లేదు అప్పుడే కాంగ్రెస్ లో కేబినెట్ కూర్పు మొదలైందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ పార్టీలో సీట్లు అమ్ముకున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వినిపించాయి, ఇప్పుడు ఏకంగా పోర్ట్ ఫోలియోలనే అమ్ముకుంటున్నారంటూ మరో బాంబు పేల్చారు ఆ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని చెప్పిన రేవంత్ రెడ్డి.. రెవెన్యూ మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ గాలి అనిల్ కుమార్ వద్ద 12 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నట్టు ఆరోపించారు. ఈ ఆరోపణలు నిజమా, రుజువులున్నాయా అనే విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఈ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది.
మహేశ్వరం టికెట్ - చిగురింత పారిజాత నర్సింహారెడ్డి నుంచి రూ.10కోట్లు, 5ఎకరాల భూమి
కల్వకుర్తి టికెట్ - ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి నుంచి రూ.6కోట్లు
రెవెన్యూ మినిస్టర్ పోస్ట్ - గాలి అనిల్ కుమార్ నుంచి రూ.12కోట్లు
ఇవీ ప్రస్తుతం రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణలు. అటు మైనంపల్లి హన్మంతరావు చేరిక సందర్భంగా జరిగిన మీటింగ్ లో కూడా పక్కన రెండు సూట్ కేసులు ఉండటంతో.. సోషల్ మీడియాలో రేవంత్ పేరు మారుమోగిపోతోంది. జాబితా ప్రకటన సమయంలో రేవంత్ పై ఇలాంటి ఆరోపణలు రావడం విశేషం. ఆయా పేర్లు రేపు జాబితాలో కూడా ఉంటే మాత్రం వైరి వర్గాలకు రేవంత్ రెడ్డి మరింతగా టార్గెట్ అవుతారనడంలో సందేహం లేదు.
భాగ్యలక్ష్మి ఆలయం - ప్రమాణాలు..
గతంలో ఈటల రాజేందర్ ఆరోపణలు చేసిన సమయంలో రేవంత్ రెడ్డి, హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. ఇప్పుడు టికెట్ల అమ్మకాలపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా ఆయన అక్కడ ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు కొత్త మనోహర్ రెడ్డి. భాగ్యలక్ష్మి ఆలయం ముందు నిలబడి రేవంత్ పై మరిన్ని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త మనోహర్ రెడ్డి లీక్స్ సంచలనంగా మారాయి.
ఈడీకి ఫిర్యాదు..?
రేవంత్ రెడ్డి అంత నిజాయితీపరుడేం కాదంటున్న కొత్త మనోహర్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలు లంచం ఇవ్వాలని చూసిన వ్యక్తి అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళనే సర్వేలో హైలైట్ చేసి చూపిస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేస్తున్నారన్నారు. రేవంత్ ఇంకా చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారని.. ఆ చిట్టా అంతా ఈడీకి, సీబీఐకి ఇచ్చి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.