సీటుకు కోట్లు - రేవంత్ పై ఆరోపణలు.. ప్రమాణాలకోసం సవాళ్లు
ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి వైరి వర్గానికి బుక్కైపోయారు. ఇంతకీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం ఎపిసోడ్ ఉంటుందో లేదో వేచి చూడాలి.
ఎన్నికలకు ముందే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆయనపై నిందలు పడ్డాయి. ఆ నిందలు చెరిపేసుకోడానికి ఆయన తలప్రాణం తోకకి వస్తోంది. అప్లికేషన్లు, సెలక్షన్ కమిటీ, ఫైనల్ గా కాంగ్రెస్ అధిష్టానం ఇన్ని వడపోతలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి సూట్ కేస్ ఇస్తే చాలు పనైపోతుంది అంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాదు, భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణాలు చేయాలంటూ సవాళ్లు విసురుతున్నారు. గతంలో మీ పాతివ్రత్యం నిరూపించుకున్నారు కదా, ఇప్పుడు కూడా ఒట్టేసి మీ తప్పు లేదని చెప్పండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
మహేశ్వరం ఎమ్మెల్యే సీటుని చిగురింత పారిజాత రెడ్డికి కేటాయించడంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది కూడా కాంగ్రెస్ లో ఉండి, ప్రస్తుతం సస్పెండ్ అయిన కొత్త మనోహర్ రెడ్డి కావడం విశేషం. 10కోట్ల రూపాయలు, 5 ఎకరాల పొలం తీసుకుని ఆ టికెట్ పారిజాత రెడ్డికి కేటాయించారనేది మనోహర్ రెడ్డి ఆరోపణ. ఈ ఆరోపణను బీఆర్ఎస్ కూడా హైలైట్ చేస్తోంది. దీంతో రేవంత్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. తాజాగా ఆయనకు ఓ సవాల్ విసిరారు మనోహర్ రెడ్డి. టికెట్లు అమ్ముకోలేదని నిరూపించుకోవాలంటే చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలన్నారు. గతంలో హుజూరాబాద్ ఎన్నికల సమయంలో తన ఓటమికోసం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వద్ద రూ.25 కోట్లు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. ఇప్పుడు కూడా అలాగే ఆయన ప్రమాణం చేయాలంటున్నారు మనోహర్ రెడ్డి. అలా చేయకపోతే డబ్బులు తీసుకున్నట్టేనని నమ్మాల్సి వస్తుందన్నారు. రేవంత్ ని, ఆయనకు డబ్బులిచ్చిన పారిజాత రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీనుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి కాంగ్రెస్ లో చేరిక, ఆ కుటుంబానికి రెండు టికెట్ల కేటాయింపు వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వినిపించాయి. మైనంపల్లితో రేవంత్ భేటీ ఫొటోలో పక్కనే రెండు సూట్ కేసులు కనపడ్డాయి. దీంతో రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి వైరి వర్గానికి బుక్కైపోయారు. ఇంతకీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం ఎపిసోడ్ ఉంటుందో లేదో వేచి చూడాలి.