Telugu Global
Telangana

రాహుల్‌పై వేటు రాజ్యాంగాన్ని దుర్వినియోగపర్చడమే : మంత్రి కేటీఆర్

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

రాహుల్‌పై వేటు రాజ్యాంగాన్ని దుర్వినియోగపర్చడమే : మంత్రి కేటీఆర్
X

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని దుర్వినియోగపర్చడమే అని ఆయన అన్నారు. అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో వేటు వేశారని.. ఇది తొందరపాటు చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా, కేటీఆర్ తన ట్వీట్‌లో ఫ్రెంచ్ తత్వవేత్త వాల్‌టేర్, జర్మన్ థియాలజిస్ట్ మార్టిన్ నిమాలర్‌ల కోట్స్‌ను కూడా పేర్కొన్నారు. 'మీరు చెప్పే విషయాలతో నేను ఏకీభవించను. కానీ మీకు ఉన్న వాక్ స్వాతంత్రాన్ని మాత్రం నాకు చావు వచ్చినా రక్షిస్తాను' అనే కోట్ ట్వీట్ చేశారు.

దీంతో పాటు ప్రముఖ థియోలజిస్ట్ మార్టిన్ నిమాలర్ చెప్పిన మాటలను కూడా పోస్టు చేశారు. 'మొదట వాళ్లు కమ్యూనిస్టుల దగ్గరకు వచ్చారు. అయితే నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి నాకెందుకు అని పట్టించుకోలేదు. తర్వాత వాళ్లు సోషలిస్టుల దగ్గరకు వచ్చారు. ఈ సారి నేను సోషలిస్టును కాదు కాబట్టి నాకెందుకులే అని ఊరుకున్నాను. తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియన్ లీడర్ల దగ్గరకు వచ్చారు. యధావిధిగా నాకెందుకులే అని వదిలేశా. ఈ సారి వాళ్లు యూదుల దగ్గరకు వచ్చారు. మళ్లీ నాకెందుకు అని పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్లు నా వద్దకు వచ్చారు. కానీ.. నా గురించి మాట్లాడటానికి ఎవరూ మిగల్లేదు' అనే సూక్తిని కూడా ట్వీట్ చేశారు.


First Published:  24 March 2023 7:58 PM IST
Next Story