టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డివి అన్నీ దొంగ మాటలే : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కాంగ్రెస్ హయాంలో ఇళ్లు అన్నీ కాగితాల మీదనే ఉండేవని.. కానీ కేసీఆర్ కట్టించిన ఇళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నాయని మంత్రి అన్నారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డివి అన్నీ దొంగ మాటలే అని.. ఆయన వెంట ఉన్న వాళ్లంతా దొంగలే అని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బాల్కొండలో కట్టిన ప్రతీ డబుల్ బెడ్రూం ఇల్లు కేసీఆర్ ఇచ్చిన పైసలతో కట్టినదేనని.. అందులో బీజేపీ, మోడీది రూపాయి కూడా లేదని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు, కాంగ్రెస్ కట్టించిన 10 ఇళ్లతో సమానమని ఆయన అన్నారు. భీమ్‌గల్ మండలం బడా భీంగల్ గ్రామంలో నిర్మించిన 112 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి ప్రారంభించి, లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కాంగ్రెస్ హయాంలో ఇళ్లు అన్నీ కాగితాల మీదనే ఉండేవని.. కానీ కేసీఆర్ కట్టించిన ఇళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ హయంలో ఇంటికి రూ.75 వేలు ఇస్తే.. ఇప్పుడు అన్ని వసతులతో కలిపి రూ.10 లక్షల విలువైన ఇళ్లను సీఎం కేసీఆర్ పేదలకు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు వాళ్ల బంధువులకే ఇండ్లను ఇచ్చుకున్నారని.. కానీ నేడు ఏ పైరవీకారుని ప్రమేయం లేకుండానే అర్హులైన పేదలందరికీ పూర్తి ఉచితంగా ఇళ్లు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
రైతు బంధును కాపీ కొట్టి బీజేపీ ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభించారని.. ఈ పథకం స్టార్టింగ్‌లో నిజామాబాద్ జిల్లాలో ఎంత మందికి లబ్ది చేకూరిందో ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ పాలనలో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను, రైతులను పీడిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. తన కార్పొరేట్ మిత్రులకు మాత్రం దేశ సంపదను దోచి పెడుతోందని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తున్నందుకు కేసీఆర్‌ను కట్టడి చేయాలని.. ఆయన బిడ్డ కవితపై కేసుల పేరుతో వేధిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
లక్షల కోట్లు దోచుకున్న మోడీ స్నేహితుడు అదానీ మీద విచారణ చేయాలని పార్లమెంటులో ప్రతీ ఎంపీ ప్రశ్నిస్తున్నారని మంత్రి అన్నారు. ఎల్ఐసీ, ఎస్బీఐలో ప్రజల డబ్బులను మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు. కానీ.. సంబంధం లేని కేసులో మాత్రం కవితపై విచారణ చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, పేద ప్రజల పక్షాన నిలబడిన కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులవి అన్నీ అబద్దపు మాటలే అని.. వారు చేస్తున్న ప్రచారం కూడా పూర్తిగా అవాస్తవాలని మంత్రి చెప్పారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలందరూ తప్పకుండా ఆలోచించాని మంత్రి విజ్ఞప్తి చేశారు.