Telugu Global
Telangana

ప్రధాని మోడీ మాటలన్నీ పచ్చి అబద్దాలు : మంత్రి కేటీఆర్

నేను సీఎం కావాలని అనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజలు అనుకుంటే సరిపోదా అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

ప్రధాని మోడీ మాటలన్నీ పచ్చి అబద్దాలు : మంత్రి కేటీఆర్
X

ప్రధాని మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆయనకు ఒక అలవాటు ఉంటుంది. బెంగాల్ వెళ్లి మమతా బెనర్జి మోస్ట్ కరప్టెడ్ అంటారు. ఒడిషా వెళ్లి నవీన్ పట్నాయక్ అత్యంత అవినీతి సీఎం అని ఆరోపిస్తారు. మేఘాలయ పోయి సంగ్మాను విమర్శిస్తారు. ఎక్కడకు పోయినా పచ్చి అబద్దాలు మాట్లాడటం ప్రధాని మోడీకి అలవాటు అయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కర్ణాటకలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందని ఆరోపణలు చేస్తారు. ఇది చిన్న పిల్లలు కూడా నమ్మని ఆరోపణలు అని కేటీఆర్ అన్నారు. నిజామాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలను గందరగోళపరిచే మాటలు చెప్పడం నిజంగా శోచనీయం. ప్రధాని మోడీ ఎప్పుడో ఒకసారి రాష్ట్రానికి టూరిస్ట్‌లా వచ్చి అడ్డమైన చెత్త వాగిపోతుంటారు. ఎన్డీయేలో సీఎం కేసీఆర్ కలవాలని అనుకున్నారని నిజామాబాద్‌లో చెప్పారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని మోడీని కేసీఆర్ కోరినట్లు ఆయన వ్యాఖ్యానించారు. నేను సీఎం కావాలని అనుకుంటే అసలు మోడీ పర్మిషన్ ఎందుకు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సీఎం కావాలని అనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజలు అనుకుంటే సరిపోదా అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

ఎన్డీయేలో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితులు లేవు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఆ కూటమి నుంచి బయటకు వచ్చాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన పార్టీలపై ఈడీ, సీబీఐని పంపుతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో రాజరికం నడుస్తోందని మోడీ ఆరోపించారు. ప్రధాని అంతా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. దేవగౌడ కొడుకు ఎన్డీయే చేరినప్పుడు మోడీకి రాజరికం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జైషా ఎవరో ప్రధానికి తెలియదా? ఆయనకు బీసీసీఐ పదవి ఎలా వచ్చిందని దుయ్యబట్టారు. మోడీతో చేరడానికి మాకేం పిచ్చికుక్క కరవలేదని.. మేం గుజరాత్, ఢిల్లీకి బానిసలం కాదని ఎద్దేవా చేశారు.

ఎన్డీయే అనేది మునిగిపోయే నావ.. అది ఎక్కాలని ఎవరూ అనుకోరని మంత్రి కేటీఆర్ సూటిగా చెప్పారు. 70 ఏళ్ల వయసులో మోడీ అన్నీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. అబద్దాలతో ప్రధాని పదవికి గౌరవాన్ని తగ్గించారని కేటీఆర్ అన్నారు. మోడీ ఎంత గొంతు చించుకున్నా అబద్దాలు నిజాలు కావు.. మోడీ దగుల్బాజీ మాటలను దేశంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణకు ఏం ఇచ్చారని ఓట్లు అడగటానికి వచ్చారు. గత 9 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మాటలు చెప్పి పోవడం తప్ప చేతలు ఏనాడైనా ఉన్నాయా అని అన్నారు. బీజేపీ అంటేనే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండియా అని ఎద్దేవా చేశారు. ఇకపై ప్రధానిని ఎవరైనా కలిస్తే ఆ సంభాషణలు రికార్డు చేసుకుంటే మంచిదని సూచించారు. ఇలా అబద్దాలు చెప్తుంటే అంతకు మించిన వేరే ఆప్షన్ లేదని చెప్పుకొచ్చారు.

First Published:  3 Oct 2023 8:06 PM IST
Next Story