Telugu Global
Telangana

వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే..

సొంతూర్ల నుంచి నగరానికి వచ్చిన జనాలతో బస్టాండులు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఉదయం నుంచే సిటీ బస్సులు, మెట్రో ట్రైన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే..
X

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఓటేసేందుకు ఊళ్లకు వెళ్లిన వాళ్లంతా హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌ చుట్టూ వాహనాల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచే జనాలు నగరం బాట పట్టారు. అయినా రద్దీ తగ్గట్లేదు. ఔట్‌కట్స్‌లో ఎక్కడ చూసిన భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఊర్ల నుంచి సొంత వాహనాల్లో బయల్దేరిన వాళ్లతో టోల్‌గేట్లు కిక్కిరిసిపోయాయి. అర్ధరాత్రి దాటినా టోల్‌ ప్లాజాల దగ్గర రద్దీ కొనసాగింది.

ఏపీ ఓటర్లు నగరం బాట పట్టడంతో విజయవాడ- హైదరాబాద్‌ హైవేపై రద్దీ మరింత ఎక్కువగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటరు మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. టోల్‌గేటు దాటడానికి దాదాపు 30 నిమిషాల సమయం పట్టింది. సాధారణ రోజుల్లోనే నిత్యం 30 నుంచి 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సోమవారం 45 వేల వాహనాలు హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు టోల్‌గేట్‌ సిబ్బంది తెలిపారు. రద్దీ ఇవాళ సాయంత్రం వరకు ఉంటుందని చెబుతున్నారు.

సొంతూర్ల నుంచి నగరానికి వచ్చిన జనాలతో బస్టాండులు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఉదయం నుంచే సిటీ బస్సులు, మెట్రో ట్రైన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సాధారణంగా మెట్రో రోజూ ఉదయం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. కానీ, ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉదయం 5.30 గంటల నుంచే రాకపోకలు మొదలుపెట్టారు. అలా ట్రైన్‌ రావడం ఆలస్యం జనంతో నిండిపోతోంది. దీంతో ఎక్కువ ట్రిప్పులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

First Published:  14 May 2024 12:01 PM IST
Next Story