టీడీపీ నేతలతో నిండిపోతున్న కాంగ్రెస్!
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావుతో ఇటీవలే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పాత నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ నేత, మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక పాలేరు టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి తుమ్మల సైతం హస్తం పార్టీ గూటికి చేరారు.
ఇక తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం. ఇటీవలే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని నివాసంలో మండవతో భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతే కాదు..నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం బీజేపీలో ఉన్న మరో మాజీ టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి సైతం త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ ములుగులో జరిగే బహిరంగసభలో రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం. కాగా, రేవూరి ప్రకాశ్ రెడ్డి గతంలో నర్సంపేట నుంచి ప్రాతినిథ్యం వహించారు. అయితే ఈ సారి నర్సంపేట టికెట్ ఇప్పటికే దొంతి మాధవరెడ్డికి కేటాయిండంతో ప్రకాష్ రెడ్డికి పరకాల టికెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ లీడర్ మోత్కుపల్లి సైతం ఇటీవల కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు.
ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీతక్క, నాగం జనార్ధన్ రెడ్డి, పెద్దపల్లి అభ్యర్థి విజయ రమణారావు, మానకొండూరు అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ సహా పలువురు సీనియర్లు టీడీపీ నుంచి వచ్చినవారే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తెలుగుదేశం పార్టీగా మార్చేస్తున్నాడని గతంలో కోమటిరెడ్డి లాంటి సీనియర్లు విమర్శించిన విషయం తెలిసిందే.
♦