వీడనున్న సస్పెన్స్.. ఇవాళ తెలంగాణ రిజల్ట్స్.!
నవంబర్ 30న తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 71.34 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. EVMలలో నిక్షిప్తమైన 2 కోట్ల 32 లక్షల ఓటర్ల తీర్పు ఇవాళ వెలువడనుంది. నవంబర్ 30న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.
లెక్కింపు కొనసాగేదిలా..
ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తర్వాత అరగంటకు ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటే ఈవీఎంల ఓట్లతో సమాంతరంగా లెక్కింపు కొనసాగనుంది. చివరి రౌండ్ మాత్రం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాతే చేపడతారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2417 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి. అత్యధికంగా జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో 26 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. అత్యల్పంగా భద్రాచలంలో కేవలం 13 రౌండ్లలో లెక్కింపు ముగియనుంది. గ్రేటర్ పరిధిలో చార్మినార్ నియోజకవర్గం సంబంధించి మొదటి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇక్కడ 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఇక ఓట్ల లెక్కింపు కోసం 119 నియోజకవర్గాల్లో 1798 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మేడ్చల్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పులను ర్యాండమ్‌గా లెక్కిస్తారు. తర్వాతే ఫలితాలను ప్రకటిస్తారు.
నవంబర్ 30న తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 71.34 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా యాకుత్‌పురాలో కేవలం 39.64 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2 వేల 290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ కూడా ఉన్నారు. బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాలకు పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 118 స్థానాల్లో బరిలో నిలిచారు. సీపీఎం 19, సీపీఐ ఒక స్థానంలో, బీఎస్పీ నుంచి 108 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
అత్యధికంగా ఎల్బీనగర్‌లో 48 మంది అభ్యర్థులు ఉండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడల్లో ఏడుగురు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఉదయం 10 గంటల తర్వాత మొదటి ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.