Telugu Global
Telangana

గురుకులాలన్నీ సమీకృతమే.. రేవంత్‌ కే ఆ విషయం తెలియదు

బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌

గురుకులాలన్నీ సమీకృతమే.. రేవంత్‌ కే ఆ విషయం తెలియదు
X

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న గురుకులాలన్నీ సమీకృతమేనని.. ఆ విషయం సీఎం రేవంత్‌ రెడ్డికి తెలువనందుకు తెలంగాణ బిడ్డగా తాను బాధ పడుతున్నానని బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొందర్గులో తనను ఉద్దేశించి సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు శనివారం ప్రవీణ్ కుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు. తాను సమీకృత గురుకులాలను అడ్డుపడుతున్నానని రేవంత్‌ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, అది తప్పు అన్నారు. 1971లో పీవీ నర్సింహారావు గురుకులాలు ప్రవేశపెట్టినప్పుడు, కేసీఆర్‌ వాటిని మూడు రెట్లకు పెంచినప్పుడు.. ఎప్పుడైనా గురుకులాలన్నీ సమీకృతమేనని తెలిపారు. సమీకృతానికి తాను వ్యతిరేకం కాదని, ఇప్పటికే ఉన్న సమీకృతంగా ఉన్న వ్యవస్థను ఏదో చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనే ప్రయత్నాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. 640 మంది విద్యార్థులే ఒక్క గురుకులంలో సరిగా ఉండలేకపోతున్నారని, అలాంటిది 2,560 మంది విద్యార్థులను ఒకే చోటకు తీసుకువస్తే చాలా సమస్యలు వస్తాయన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీ దానికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ అని.. అందుకే తాను ఎక్కువ మంది విద్యార్థులను ఒక్క చోట పెట్టొద్దని కోరుతున్నానని తెలిపారు. ఇప్పుడున్న గురుకులాలకే ఎక్కువ నిధులు ఇచ్చి మరిన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాటిలో ఇతర కులాల కోటా పెంచాలని సూచించారు. కేబినెట్‌, కాంట్రాక్టులు, న్యాయవ్యవస్థ, మిగతా వ్యవస్థలు సమీకృతం కావని.. కాంగ్రెస్‌ పార్టీలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్‌ ఉంటాయని గుర్తు చేశారు. కానీ గురుకులాలకు వచ్చే సరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు అంటే తప్పేముందని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డికి గురుకులాల చరిత్ర తెలియనుందుకు తాను బాధ పడుతున్నానని అన్నారు. ఇప్పుడున్న గురుకులాల్లోనే అన్ని కులాలు, అన్ని మతాల విద్యార్థులు కలిసే ఉన్నారని తెలిపారు. అవసరమైతే రికార్డులు పరిశీలించుకోవాలే తప్ప.. ఆ పేరుతో కేసీఆర్ పై దుమ్మెత్తిపోయవద్దని హితవు పలికారు.

First Published:  12 Oct 2024 4:46 PM IST
Next Story