Telugu Global
Telangana

ఆ నాలుగు నియోజకవర్గాలపై అందరి చూపు.. ఈ సారి కూడా హోరాహోరీ తప్పదా?

హైదరాబాద్‌లోని కొన్ని సెగ్మెంట్లలో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రసవత్తరమైన పోటీ జరిగింది.

ఆ నాలుగు నియోజకవర్గాలపై అందరి చూపు.. ఈ సారి కూడా హోరాహోరీ తప్పదా?
X

విజయం అంటే విజయమే. అది ఒక్క ఓటు మెజార్టీనా.. లక్ష ఓట్ల మెజార్టీనా అనేది తర్వాత విషయం. అయితే బొటాబొటి ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తులకు తర్వాత ఎన్నికల్లో భయం ఉండటం సహజం. అతి తక్కువ మార్జిన్‌తో ఓడిన క్యాండిడేట్లు కూడా.. ఈ సారి మరింత గట్టిగా ప్రయత్నిస్తారు. అందుకే అలాంటి నియోజకవర్గాల్లో జరిగే హోరాహోరీ పోరుపై ప్రజలకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. హైదరాబాద్‌లోని కొన్ని సెగ్మెంట్లలో 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రసవత్తరమైన పోటీ జరిగింది. తక్కువ మార్జిన్‌తోనే కొంత మంది గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

అంబర్‌పేట నియోజవకర్గం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాలేరు వెంకటేశ్, బీజేపీ నుంచి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో వీరిద్దరి మధ్యే పోటీ నెలకొన్నది. చివరకు కిషన్ రెడ్డిపై కాలేరు వెంకటేశ్ 1016 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కౌంటింగ్ సమయంలో చివరి రౌండ్ వరకు ఇద్దరి మధ్య గెలుపోటములు దోబూచులాడాయి. ఇక ఈ సారి కూడా కిషన్ రెడ్డి బరిలోకి దిగితే.. పోటీ రసవత్తరంగా మారనున్నది. బీఆర్ఎస్ నుంచి వెంకటేశ్ మరోసారి బీఫామ్ అందుకున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ నుంచి మాత్రం అభ్యర్థులు ఖరారు కాలేదు.

హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా ఇలాంటి పోటీనే జరిగింది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మహాకూటమి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై కేవలం 376 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గతంలో కూడా వీరిద్దరే ఇబ్రహీం పట్నం నుంచి పలు మార్లు పోటీ పడ్డారు. మరోసారి కిషన్ రెడ్డి, రంగారెడ్డి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉండే నాంపల్లి నియోజకవర్గంపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌పై 9675 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీతో పోల్చితే ఇది స్వల్ప ఆధిక్యమే అని చెప్పాలి. ఈ సారి కూడా నాంపల్లి నుంచి వీరిద్దరి మధ్యే పోటీ ఉండబోతోంది. మరోసారి నాంపల్లిని కైవసం చేసుకోవాలని ఎంఐఎం పట్టుదలగా ఉన్నది. అయితే ఓడిపోయినా ప్రజల మధ్య ఉంటూ వచ్చిన ఫిరోజ్ ఖాన్.. తప్పకుండా విజయం నాదే అనే ధీమాతో ఉన్నారు.

మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి సబితా ఇంద్రారెడ్డి బరిలోకి దిగారు. ఆమెపై పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి తీగల క్రిష్ణారెడ్డి గట్టి పోటీనే ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు సాగింది. సబిత, తీగలకు పోటీగా నిలబడిన బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు 39 వేల ఓట్లకు పైగా సాధించారు. దీంతో బీఆర్ఎస్ భారీగా ఓట్లను కోల్పోవలసి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి సబిత ఇంద్రారెడ్డి 9,227 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆనాడు బీజేపీ గట్టి పోటీ ఇవ్వకపోతే తప్పకుండా బీఆర్ఎస్ నుంచి తీగల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వారని స్థానికులు చెబుతుంటారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సబిత ఇంద్రారెడ్డి బరిలోకి దిగనున్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నది.

First Published:  21 Oct 2023 9:04 AM IST
Next Story